1986లో ‘రోజూ చస్తున్న మనిషి’ పేరుతో తొలి నాటిక రాశారు. అప్పట్నుంచి నటన, రచనతో రంగస్థలంతో అనుబంధం పెనవేసుకుంది. గొంగళిపురుగు, పక్కింట్లో పుట్టండి, సంపద, అధికారి, భూమికోసం, నష్టపరిహారం, కాళ్లు కడిగిన చేతులు, ప్రార్థన(రేడియో నాటిక), సారా సుద్దులు (వీధినాటిక) వంటి నాటికలను రాశారు. నాటికల పేర్లు మాత్రమే కాదు... ఇతివృత్తాలన్నీ విభిన్నంగా, సమాజాన్ని ప్రశ్నించేవిగా ఉండే రచనలు కావటం విశేషం. కొన్ని ఇతివృత్తాలకు నాటకరంగం ఉలిక్కిపడిన సందర్భాలున్నాయి. రచయితగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు, ఎన్నో చర్చలకు దారితీశాయి.
నటనలోనూ తనదొక ప్రత్యేక స్కూలు. రంగస్థల రచయితగా, నటుడుగా, అటు సినీరంగంలోనూ సంభాషణల రచయితగా, నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. వీరి నాటికలు కొన్నింటిని గంగోత్రి, పెదకాకాని, ప్రజాకళామండలి, అభినయ, ఒంగోలు సమాజాలు ప్రదర్శించాయి. గొంగళిపురుగు, అధికారి, కాళ్లుకడిగిన చేతులు నాటికలను తన దర్శకత్వంలో ప్రదర్శిస్తూ నటించారు. ఐదోగది, అమృతం ఇంకా వుంది, గుర్తుతెలియని శవం నాటికల్లో నటిస్తూ దర్శకత్వం వహించారు. ఇవేకాకుండా శిష్టా ్ల చంద్రశేఖర్ రచన గుండెచప్పుడు, గొల్లపూడి మారుతీరావు రాగరాగిణి నాటికలకు దర్శకత్వం వహించారు. ‘కాళ్లు కడిగిన చేతులు’ నాటికలో సినీనటులు, తెనాలికి చెందిన ఏవీఎస్, శివపార్వతి నటించారు. రాగరాగిణిలో జయప్రకాష్‌రెడ్డి, ‘గో టు హెల్’లో చాట్ల శ్రీరాములు దర్శకత్వంలో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రితో కలిసి నటించారు. రచయిత, నటుడు, దర్శకుడిగా కృష్ణేశ్వరరావు ప్రదర్శించిన అన్ని ప్రదర్శనలు ప్రేక్షకాదరణ పొందాయి. సంపద నాటిక 170కు పైగా ప్రదర్శనలకు నోచుకుంది. శ్రీపాద సుబ్రహ్మణ్యం కథను రంగస్థలానువర్తనం చేసి ఒకే పాత్రగా ‘మార్గదర్శి’ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఆకాశవాణిలో బీ–హై కళాకారుడిగా పలు నాటికలు, నాటకాల్లో పాల్గొన్నారు.


