● గుజిరీ వ్యాపారి నుంచి మామూళ్లు
● సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
హిందూపురం(చిలమత్తూరు): హిందూపురం కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి కృష్ణవేణి అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగు చూసింది. ఓ చిరు వ్యాపారి నుంచి నగదు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో మరో అధికారి సురేంద్రరెడ్డి పేరు కూడా ప్రస్తావిస్తూ.. ‘ఆయనకు చెప్పొద్దండి’ అని వ్యాపారి అనడంతో ఆయన పాత్రపైనా చర్చ సాగుతోంది. హిందూపురంలో కొంతకాలంగా వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్టీ) అధికారుల వేధింపులు తీవ్రమైనట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. చిన్న, పెద్ద వ్యాపారులు.. ఇలా ఎవరైనా నెలవారీ మామూళ్లు చెల్లించాల్సిందేనని, ప్రశ్నిస్తే కేసులు రాయడం, వేధించడం పరిపాటిగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుజిరీ వ్యాపారి ఫయాజ్ నుంచి సీటీఓ కృష్ణవేణి నగదు తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. మొదట్లో మూడు నెలల పాటు తాను సీటీఓకు డబ్బులు చెల్లించానని, తర్వాత మిగిలిన వ్యాపారుల వద్ద నుంచి కూడా లంచాలు వసూలు చేయాలని చెప్పారని ఫయాజ్ ఆరోపించాడు. తొలుత రూ.10 వేలు ఇస్తాననగా ఏకంగా రూ.50 వేలు డిమాండ్ చేశారని, ఆ మొత్తం ఇవ్వకపోతే బిల్లులు తప్పులు ఉన్నాయని కేసులు రాస్తానని బెదిరించారని, చివరకు రూ.30 వేలకు ఒప్పుకున్నారని అతను తెలిపాడు. ఇతర వ్యాపారుల వద్ద నుంచి కూడా నెలవారీ మామూళ్లు తీసుకువచ్చి ఇచ్చినట్టు వెల్లడించాడు.
బీజేపీ, జనసేన నేతల వేధింపులు
హిందూపురంలోని గుజిరీ వ్యాపారులు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలకు మూమూళ్లు ఇవ్వాలని ఒత్తిడి రావడంతో వారు ఆందోళన చెందారు. మొత్తం రూ.50 లక్షలు బీజేపీ, జనసేన నేతల ద్వారా వసూలు చేయించి..అందరూ వాటాలు పంచుకునేలా ఎమ్మెల్యే పీఏలు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో కూటమి నేతలు కొన్నాళ్లు వెనక్కి తగ్గారు. మళ్లీ కమర్షియల్ ట్యాక్స్ అధికారుల ద్వారా వసూళ్లకు పూనుకున్నట్లు తెలుస్తోంది. వీడియోలో బీజేపీ పట్టణ నేత ఆదర్శకుమార్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ‘ఆదర్శ్ మీ కార్యాలయంలో కింద ఉంటాడ’ని వ్యాపారి ఫయాజ్ ప్రస్తావించగా.. అతనెవరో తనకు తెలియదని కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి కృష్ణవేణి చెప్పడం అందులో ఉంది.


