ఉరవకొండ: బాలల దినోత్సవం రోజున దేవుడి దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తున్న విద్యార్థి.. ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఘటన అనంతపురం– బళ్లారి 42వ జాతీయ రహదారిపై చిన్నముష్టూరు సమీపంలోని హంద్రీనీవా కాలువ బ్రిడ్జిపై శనివారం చోటు చేసుకుంది. ఇదే ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి.. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు పట్టణంలోని విజ్ఞానజ్యోతి స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఈశ్వర్‌ప్రసాద్, హేమంత్, హరీష్ గుంతకల్లు నుంచి ద్విచక్ర వాహనంపై పెన్నహోబిలం వెళ్లారు. నరసింహస్వామిని దర్శించుకొని తిరుగు పయనమయ్యారు. చిన్నముష్టూరు సమీపంలో హంద్రీ–నీవా కాలువ బ్రిడ్జి వద్ద అనంతపురం నుంచి ఉరవకొండకు వెళ్తున్న వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలికి చెందిన వలి, జమీలా దంపతులు ద్విచక్ర వాహనం ఓవర్‌టేక్ చేయపోయి వెనుక వైపు నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనతో హంద్రీ–నీవా కాలువపై చెల్లాచెదురుగా పడిపోయారు. మరో వైపు అదే సమయంలో ఉరవకొండ నుంచి అనంతపురానికి ద్విచక్ర వాహనంపై విడపనకల్లు మండలం కొట్టాలపల్లికి చెందిన ప్రసన్నకుమార్, లక్ష్మి దంపతులు వెళ్తున్నారు. అప్పటికే హంద్రీనీవా కాలువపై పడిపోయిన ద్విచక్ర వాహనాలు, క్షత్రగాత్రులను తప్పించబోయి అదుపు తప్పి దంపతులిద్దరూ కిందపడిపోయారు. దీంతో 108 వాహనంలో క్షతగాత్రులను ఉరవకొండ ఆస్పత్రికి తరలించగా, ఇందులో పదో తరగతి విద్యార్థి ఈశ్వర్ ప్రసాద్ (16) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రసన్నకుమార్‌తో పాటు తీవ్రంగా గాయపడిన మిగితా వారిని చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు.
ఏడాది క్రితం తండ్రి.. నేడు కొడుకు
గుంతకల్లు మండలం దోనిముక్కల గ్రామానికి చెందిన కళ్యాణ్‌బాబు, లలితమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు ఈశ్వర్‌ప్రసాద్, మరో కుమారుడు అనిల్. ఈశ్వర ప్రసాద్ తండ్రి కళ్యాణబాబు ఏడాది క్రితం మృతి చెందాడు. తల్లి లలితమ్మ రెక్కల కష్టంతో పిల్లలు ఇద్దరినీ చదివిస్తోంది. ఈశ్వర్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో బాలల దినోత్సవం రోజునే మృతి చెందడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.
ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో విద్యార్థి దుర్మరణం
మరో ఆరుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం


