అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభమైంది. సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్ పత్రాలు సమర్పించడంతోనే అభ్యర్థిత్వం ఖరారైనట్లు కాదు. ఎన్నికల అధికారులు చేపట్టే నామినేషన్ల పరిశీలనలో అన్ని అర్హతలు, పత్రాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేది కీలకం. చిన్న పొరపాటు అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గెలుపే లక్ష్యంగా సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు నామినేషన్ దశలోనే కీలకంగా వ్యవహరించాలి. ప్రచారం, పోటీ, గెలుపు వ్యూహాలపై దృష్టి సారించే ఆశావహులు నామినేషన్ పత్రాల విషయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఓటరు జాబితాలో వివరాల తేడాలు, ప్రతిపాదకుడి అర్హత లేకపోవడం, సంతకాల లోపాలు, రిజర్వేషన్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
ముందుగా అర్హతలు చూసుకోవాలి...
సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారికి కనీసం 21 ఏళ్ల వయస్సు ఉండాలి. సంబంధిత గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో అభ్యర్థి పేరు నమోదై ఉండాలి. పోటీ చేసే స్థానం రిజర్వు స్థానమైతే దానికనుగుణంగా అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థి తన అర్హతలను ముందుగానే నిర్ధారించుకోవాలి.
ప్రతిపాదకుడి విషయంలో జాగ్రత్త
సర్పంచు అభ్యర్థికి అదే గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ వార్డులోనైనా ఓటరుగా నమోదైన వ్యక్తి ప్రతిపాదకుడిగా ఉండొచ్చు. అయితే వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థికి సంబంధిత వార్డులో ఓటరుగా నమోదైన వ్యక్తే ప్రతిపాదకుడిగా ఉండాలి. ఈ విషయంలో పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు అవకాశం ఉంటుంది.
అనర్హతలపైనా అవగాహన ఉండాలి..
చట్టప్రకారం పోటీకి అనర్హత కలిగించే అంశాలను అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. ఎన్నికల చట్టంలో పేర్కొన్న అనర్హతలు, సంబంధిత స్థానానికి అవసరమైన రిజర్వేషన్ అర్హతలు, ఓటరు జాబితాలో పేరు లేకపోవడం తదితర అంశాలు నామినేషన్ తిరస్కరణకు కారణమవుతాయి. స్థానిక సంస్థలకు సంబంధించిన బకాయిల విషయంలోనూ వర్తించే చట్టపరమైన నిబంధనలు తెలుసుకోవాలి. పోలీసు నిరభ్యంతర పత్రం, అన్ని శాఖల బకాయిల పత్రాలు తప్పనిసరి అంటూ ప్రచారంలో ఉన్న సమాచారాన్ని నమ్మకుండా తాజా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రిటర్నింగ్ అధికారి వద్ద నిర్ధారించుకోవాలి.
నామినేషన్ పరిశీలన కీలకమే..
నామినేషన్ సమర్పించినంత మాత్రాన పోటీలో ఉన్నట్లుకాదు. నిర్ణీత తేదీన రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. అభ్యర్థి, ప్రతిపాదకుడు లేదా అభ్యర్థి లిఖిత పూర్వకంగా అధికారం ఇచ్చిన మరో వ్యక్తి పరిశీలన సమయంలో హాజరుకావచ్చు. ఇతర అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో అభ్యర్థులు పరిశీలన తేదీని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నామినేషన్ తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను రిటర్నింగ్ అధికారి నమోదు చేయాలి. తిరస్కరణపై నిర్ణీత గడువులో సంబంధిత అప్పీల్ అధికారిని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం నామినేషన్ రసీదు, తిరస్కరణ ఉత్తర్వు, సంబంధిత ఆధార పత్రాలను భద్రపరచుకోవాలి.
చివరి రోజు వరకు వేచి చూడొద్దు
నామినేషన్ దాఖలుకు చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తును ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. సందేహాలుంటే రిటర్నింగ్ అధికారి లేదా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలి. అధికారుల సూచనలు పాటిస్తూ నిబంధనల ప్రకారం నామినేషన్ సమర్పిస్తే అనవసర ఇబ్బందులను నివారించుకోవచ్చని ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగినవారు సూచిస్తున్నారు.
చిన్న పొరపాటు.. నామినేషన్ తిరస్కరణ!
ఓటరు జాబితా నుంచి సంతకాల వరకు అన్నీ సరిచూసుకోవాలి
నామినేషన్ పరిశీలనపై అవగాహన అవసరం


