అనంతపురం కల్చరల్: ఒక్కరోజు ఎన్నికల కోసం పగ, ప్రతీకారాలతో జీవితాలను బుగ్గి చేసుకోకుండా అందరూ ప్రశాంత వాతావరణం ఉండేలా కృషి చేద్దామని వేమన ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ వీసీ కాడా రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వేమన ఫౌండేషన్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డితో పాటు కార్యదర్శి డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి మాట్లాడారు. కక్షలు దీర్ఘకాలం కొనసాగితే కేవలం వారి కుటుంబాలే కాకుండా గ్రామాభివృద్ధి కూడా కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంతంగా సాగడానికి అందరం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రవీంద్రరాజు, మనోరంజన్‌రెడ్డి, నాగశేషారెడ్డి పాల్గొన్నారు.
వృద్ధుడి ఆత్మహత్య
శెట్టూరు: మండలంలోని అయ్యగార్లపల్లి వద్ద కాలయ ఈరన్న (71) ఉరి వేసుకొని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరానికి చెందిన ఈరన్న గత రెండేళ్లుగా అయ్యగార్లపల్లికి చెందిన శివశంకర్ పొలంలో పనిచేస్తూ ఉండేవాడు. వయస్సు మీదపడింది. దీనికితోడు 12 ఏళ్ల క్రితమే భార్య మరణించింది. దీంతో ఈరన్నను వృద్ధాప్యంలో చూసుకునేవారు లేరు. ఒంటరి జీవనంతో మదనపడుతుండేవాడు. మనస్తాపం చెంది పనిచేస్తున్న తోటలోని రేకుల షెడ్డుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని కుమారుడు ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


