● ట్రాక్టర్ నుంచి కింద పడి చిన్నారి మృతి
రాయదుర్గం రూరల్: ఓ వైపు బాలలంతా ఆనందోత్సాహాలతో బాలల దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. పొట్టచేత పట్టుకొని పొరుగు ప్రాంతానికి వచ్చిన దంపతులకు విషాదం మిగిలింది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఐదేళ్ల చిన్నారిని.. ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. ఈహృదయ విదారక ఘటన వేపరాల వద్ద శనివారం చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన మేరకు..మండల పరిధిలోని వేపరాల గ్రామంలో రాఘవేంద్ర గౌడ్‌కు చెందిన బొగ్గుల బట్టీలో ప్రకాశం జిల్లాకు చెందిన సూరి, మేరి దంపతులు పనిచేస్తున్నార. పిల్లలు తక్షణ్, అక్షర (5)తో కలిసి అక్కడే ఉంటున్నారు. సూరి వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, మేరి బట్టీలో కూలి పనులు చేస్తుండేది. శనివారం మధ్యాహ్నం అక్షర ట్రాక్టర్ నుంచి కిందపడింది. కిందపడిన సమయంలో రాయిపై పడింది. తలకు బలమైన గాయం కావడంతో చెవి నుంచి రక్తస్రావమైంది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతిచెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


