అనంతపురం కల్చరల్: విద్యార్థుల ఉజ్వల భవితకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు పేర్కొన్నారు. 59వ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జిల్లా కేంద్రంలోని మహిళా, బాలల గ్రంథాలయంలో నిర్వహించిన వేడుకలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, కార్యదర్శి శివప్రసాద్ ఆత్మీయ అతిథులుగా హాజరై మాట్లాడారు. ఉమన్ లైబ్రరీ అధికారి ఏఎం శ్రీపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పండిట్ నెహ్రూ, గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాలను వినియోగించుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించారు. జ్ఞానసముపార్జనకు మాత్రమే కాకుండా ఎన్నో పోటీ పరీక్షలకు గ్రంథాలయాలలో చక్కటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ కమ్మన్న, అంకె రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
హేమంత్‌కు కొనసాగుతున్న వైద్య పరీక్షలు
కర్నూలు (హాస్పిటల్): రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌కు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను కొద్దిరోజుల క్రితం మంచంపై నుంచి కింద పడటంతో ఊపిరితిత్తుల్లో సమస్య వచ్చింది. దీంతో మెరుగైన వైద్యం కోసం శుక్రవారం అర్ధరాత్రి కర్నూలుకు తీసుకొచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైద్యులు పరిశీలించి అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లోని కొన్ని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. వైద్యనిపుణులు తదుపరి పరీక్షలు నిర్వహించి, ఊపిరితిత్తుల్లో ఏర్పడిన రక్తపు గడ్డలను కరిగించేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. శనివారం ఉదయం మళ్లీ హేమంత్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందంతో కలిసి డాక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, అనంతపురం నుంచి వచ్చినప్పుడు కొంత ఆయాసం ఉందన్నారు. ప్రస్తుతం ఆయాసం లేదని, వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స కొనసాగుతోందని వివరించారు.
బరౌని–బెంగళూరు
మధ్య స్పెషల్ రైలు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఒకే ఒక్క ట్రిప్‌తో బరౌని–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ రైలు (05250) ఈ నెల 20న బరౌని రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. షాపూర్ పటోరీ, హాజీపూర్, సోన్పూర్, పాట్నా, చానాపూర్, ఆరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్, సత్నా, కట్నీ, నాగాపూర్, బల్హార్షా, ఖాజీపేట, సికింద్రాబాద్, వికారాబాద్, కృష్ణ, రాయచూర్, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా బెంగళూరు చేరుకోనుంది. ఈ రైలులో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల
అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ నాలుగో సెమిస్టర్ (జూన్–2026) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ జ్యోతి కుమార్ శనివారం విడుదల చేశారు. 6,822 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 3,821 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 56.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కోర్సుల వారీగా పరిశీలిస్తే.. బీసీఏ విద్యార్థులు అత్యధికంగా 70.66 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీఏలో 70.48 శాతం, బీఎస్సీలో 64.93 శాతం, బీబీఏలో 57.57 శాతం, బీకాంలో 47.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య పాల్గొన్నారు.


