అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు–2026 తొలి విడతకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడతలో జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 13 మండలాల్లో మొత్తం 218 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటికే సమాయత్తమవుతుండగా, గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
10 మండలాలు కళ్యాణదుర్గం డివిజన్‌లోనే..
తొలి విడత ఎన్నికల్లో కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యధికంగా పది మండలాలు ఉన్నాయి. కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, రాయదుర్గం, డీ హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు, గుమ్మఘట్ట మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తంగా 218 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ సాగనుంది.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న రిటర్నింగ్ అధికారులు ఫారం–1లో ఎన్నికల నోటీసు జారీ చేయనున్నారు. అదే రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అవసరమైన ధ్రువపత్రాలు, ఎన్నికల నిబంధనలకు సంబంధించిన వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరించిన నామినేషన్లపై సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వద్ద 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీలు చేసుకోవచ్చు. 20న అప్పీళ్లను పరిష్కరిస్తారు. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు 21 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
26న పోలింగ్
పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాల ప్రకటన రోజునే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అనివార్య కారణాలతో ఆ రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే, మరుసటి రోజు సెలవు దినమైనప్పటికీ ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి.
ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కండి
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ పేర్లు సంబంధిత గ్రామ పంచాయతీ వార్డు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో ముందుగానే పరిశీలించుకోవాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే ఓటరు గుర్తింపు పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. పోలింగ్ రోజున నిర్దేశించిన సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరుకుని స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రలోభాలకు ఓటర్లు లొంగకుండా గ్రామాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి స్థానిక సమస్యలపై పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలి.
13 మండలాల్లో తొలి విడత పోరు
నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
26న పోలింగ్, అదే రోజు ఫలితాలు


