సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘పల్లె పోరు’లో రూ.లక్షలు ఖర్చు పెట్టే వారికే మద్దతు ఇస్తామంటూ కూటమి నేతలు తేగేసి చెప్తున్నారు. అలాకాకుండా పార్టీకి సేవలు చేశాం.. సీనియర్ నాయకులం అంటూ తమ వద్దకు రావొద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడుతున్నామంటూ తమ బయోడేటాలు సమర్పిస్తున్న వారితో... మినిమం రూ.10 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగితేనే తమ వద్దకు రావాలని ఎమ్మెల్యేలు కరాఖండీగా చెప్పేస్తున్నారు. వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు కొనుగోలు చేసేవారికే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. అలాగే ప్రత్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటూ గెలవగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలని కండీషన్ పెడుతున్నారు. గెలిస్తే ఫైనాన్స్ కమిషన్ నిధులు పుష్కలంగా దండుకోవచ్చనే ఆలోచనలో కూటమి ఆశావహులు ఉన్నారు.
ఈ గ్రామ పంచాయతీలకు ఫుల్ డిమాండ్
అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, రాప్తాడు, గార్లదిన్నె, డి.హీరేహాళ్ మండలాల్లోని కొన్ని పంచాయతీలకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. హైవేలకు దగ్గరగా ఉన్న పంచాయతీల్లో రియల్ ఎస్టేట్ జోరుగా ఉంటుందన్న ఆశతో ఉన్నారు. అలాగే డి.హీరేహాళ్ మండలంలో మైనింగ్ ఉన్న పంచాయతీల్లో పోటీ చేసేందుకు కూటమి నుంచి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సోలార్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పంచాయతీలకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది.
ఎలాగైనా గెలవాల్సిందే...
మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అధికార కూటమి ప్రజాప్రతినిధులు సాగించిన అరాచకాలు, అక్రమాలు, దుశ్శాసన పర్వాన్ని మరచిపోకముందే మళ్లీ అలాంటివే సర్పంచ్ ఎన్నికల్లో పునరావృతం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. పల్లెల్లో తమ పార్టీ సానుభూతిపరులు మాత్రమే నామినేషన్ వేయాలని, ప్రత్యర్థులెవరూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఇప్పటికే బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఈ అరాచకాలు శృతిమించిపోతున్నాయి. గెలుపు కోసం ఏం చేయడానికై నా సిద్ధపడుతున్నారు. పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, తాడిపత్రి, పామిడి మండలాల్లో ఫ్యాక్షన్‌ను రాజేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
‘పల్లె పోరు’కు సిద్ధపడుతున్న ఆశావహులు
రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చుకు సిద్ధం
డబ్బులుంటేనే పోటీకి సిద్ధపడాలంటూ ఎమ్మెల్యేల హుకుం
మున్సిపల్, పరిషత్ ఎన్నికల అక్రమాలనే కొనసాగిద్దామంటూ కూటమి కుట్రలు


