అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు నామినేషన్లకు ముందే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించే సమయంలో చిన్నపాటి పొరపాట్లు జరిగినా, అవసరమైన ప్రకటనలు జత చేయకపోయినా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల నిబంధనలు సూచిస్తున్నాయి.
ఫారం–3 తప్పనిసరి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు నిర్దేశిత ఫారం–3లో నామినేషన్ దాఖలు చేయాలి. ఈ పత్రాన్ని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి పొందవచ్చు. అభ్యర్థి పేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, వయస్సు, ఓటరు జాబితాలోని క్రమసంఖ్య, పోటీ చేసే పదవి, వార్డు వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. అభ్యర్థితోపాటు ప్రతిపాదకుడు కూడా నామినేషన్ పత్రంపై సంతకం చేయాలి.
డిపాజిట్ ఎంతంటే..
ప్రస్తుత ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం సర్పంచ్ పదవికి సాధారణ అభ్యర్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500 డిపాజిట్ చెల్లించాలి. వార్డు సభ్యుల పదవికి సాధారణ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. డిపాజిట్ చెల్లించిన ఆధారాన్ని నామినేషన్‌తోపాటు సమర్పించాలి.
రిజర్వేషన్ వివరాలు ముఖ్యం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీ చేసేవారు ఆయా స్థానాలకు నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి. కులం లేదా వర్గానికి సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రంలో పేర్కొనాలి. సంబంధిత ధ్రువీకరణ పత్రం ఉంటే ముందుగానే సిద్ధం చేసుకోవాలి. సంబంధిత గ్రామ పంచాయతీకి నియమించిన రిటర్నింగ్ అధికారి వద్ద అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు స్వయంగా నామినేషన్ పత్రాన్ని సమర్పించాలి. సమర్పించిన అనంతరం రిటర్నింగ్ అధికారి నుంచి రసీదు తీసుకోవాలి. అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే పత్రాలను సిద్ధం చేసుకోవాలని, నామినేషన్ సమర్పించే ముందు అన్ని వివరాలను మరోసారి సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ సిద్ధం చేసుకోవాలి..
నిర్దేశిత నమూనాలో నింపిన నామినేషన్ పత్రం (ఫారం–3)
అభ్యర్థి, ప్రతిపాదకుడి ఓటరు జాబితా క్రమసంఖ్యలు, వార్డు వివరాలు
నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన స్వీయ ప్రకటన
స్వీయ ప్రకటనపై ఇద్దరు సాక్షుల ధ్రువీకరణ
ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్వహిస్తాననే ప్రకటన
నిర్దేశించిన భద్రతా డిపాజిట్ చెల్లించిన రసీదు లేదా చలానా
రిజర్వు స్థానాల్లో పోటీ చేసేవారికి సంబంధిత కులం లేదా వర్గానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం లేదా నిబంధనల ప్రకారం ఫారం–3లోని సంబంధిత ప్రకటన
గుర్తింపు కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రం ప్రతులు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వయస్సు నిర్ధారణ పత్రం సిద్ధంగా ఉంచుకోవడం మంచిది
నామినేషన్‌కు సిద్ధమా..
సర్పంచ్, వార్డు అభ్యర్థులు అప్రమత్తం కావాలి
దరఖాస్తుతోపాటు ధ్రువపత్రాలు సమర్పించాల్సిందే..


