జనగణనలో పొరపాట్లకు తావివ్వకండి | - | Sakshi
Sakshi News home page

జనగణనలో పొరపాట్లకు తావివ్వకండి

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

● సమగ్ర వివరాలు సేకరించాలి

అనంతపురం అర్బన్‌: జనగణనలో ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదని కలెక్టర్‌ ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జేఎన్‌టీయూలోని ఈఈఈ బ్లాక్‌ సెమినార్‌ హాలులో జిల్లా, చార్జ్‌లెవల్‌ అధికారుల జనాభా గణన ప్రక్రియ రెండవ దశ శిక్షణను కలెక్టర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా గణన–2027 దేశంలో 16వ జనాభా గణన కాగా.. స్వాతంత్య్రం అనంతరం 8వ జనాభా గణన అవుతుందన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన పూర్తి చేశారన్నారు. ఇప్పుడు రెండవ దశలో జనాభా గణన చేపట్టాల్సి ఉంటుందన్నారు. దేశంలో మొట్టమొదటి డిజిటల్‌ సెన్సెన్స్‌ కావడం వల్ల ఈ జనాభాగణన విశిష్టమైనదన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహనను చార్జ్‌లెవల్‌ అధికారులు కల్పించాలని చెప్పారు. గ్రామ, పట్టణ, వార్డుస్థాయిలో ప్రాథమిక డేటాను అందించే అతిపెద్ద మూలాధారం సెన్సెస్‌ అని అన్నారు. గృహాల నివాసయోగ స్థితి, వసతులు, ఆస్తులు, జనాభా వివరాలు, మతం, షెడ్యూల్‌ కులాలు, తెగలు, భాష, అక్షరాస్యత, విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు, సంతాన వివరాలు వంటి వివిధ అంశాలపై సూక్ష్మస్థాయి సమాచారాన్ని తప్పులు లేకుండా డిజిటల్‌ ఉపకరణాలు, ఇతర మాధ్యమాల ద్వారా డేటా సేకరించాలన్నారు. ఎన్యుమరేటర్లు తమ సొంత స్మార్ట్‌ ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ను ఉపయోగించి కుటుంబాల నుంచి డేటా సేకరించాలన్నారు. ఆయా కుటుంబాలకు ఒక నిర్ధిష్ట పోర్టల్‌ ద్వారా స్వీయ గణన చేసుకునే అవకాశమూ ఉందన్నారు.

జనవరి 10 నుంచి స్వీయ నమోదు

జనాభా గణనకు సంబంధించి 2027 జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు స్వీయ నమోదు రెండవ విడత చేసుకోవచ్చని ప్రజలకు కలెక్టర్‌ సూచించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశ ప్రణాళిక, సమగ్రమైన అభివృద్ధి అవసరమైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు సేకరిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, సెన్సెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ దిబాకర్‌ బరిహ, ఏడీ డెహురీ, ఆర్డీఓలు ప్రేమంత్‌కుమార్‌, వసంతబాబు, సీపీఓ బాలాజీనాయక్‌, కో–ఆర్డినేషన్‌ విభాగం సూపరింటెండెంట్‌ యుగేశ్వరిదేవి, గణాంకాధికారి గిరిధర్‌, మాస్టర్‌ ట్రైనర్లు జీఎల్‌ఎన్‌ ప్రసాద్‌, కిరణ్‌, డీటీ మధుసూదన్‌రావు, తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.

మహిళా ఓటర్లే అధికం

● జిల్లాలోని 576 గ్రామ పంచాయతీల పరిధిలో 5,820 వార్డులు

● ఓటు హక్కు వినియోగించుకోనున్న 13,33,915 మంది ఓటర్లు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 576 గ్రామ పంచాయతీల పరిధిలో 5,820 వార్డులకు గాను 6,025 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 13,33,915 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో మహిళల సంఖ్యే అధికంగా ఉండటం గమనార్హం. మొత్తం ఓటర్లలో 6,62,453 మంది పురుషులు, 6,71,340 మంది మహిళలు, 122 మంది ఇతరులు ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 8,887 మంది అధికంగా ఉన్నారు.

అనంతపురం రూరల్‌లో

అత్యధిక ఓటర్లు

మండలాల వారీగా పరిశీలిస్తే అనంతపురం రూరల్‌ మండలం పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా 96,110 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 47,214 మంది పురుషులు, 48,889 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. మరోవైపు పెద్దపప్పూరు మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో అత్యల్పంగా 28,308 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14,382 మంది పురుషులు, 13,924 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటంతో పంచాయతీ ఎన్నికల్లో వారి ఓటు కీలకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement