తాడిపత్రిటౌన్: పట్టణానికి చెందిన అనిల్‌నాయక్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయినట్లు కోచ్ నరేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10, 11న పిఠాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో అండర్– 19 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అనిల్‌నాయక్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఈనెల 26 నుంచి 30 వరకు జార్ఖండ్‌లో జరగనున్న 70వ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్, పలువురు పట్టణ ప్రముఖులు అనిల్‌నాయక్‌ను అభినందించారు.
జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలి
అనంతపురం సెంట్రల్ : ఇటీవల ట్విట్టర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జనసేన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, సోషల్ మీడియా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం సోషల్ మీడియా నగర కమిటీ ఆధ్వర్యంలో రెండో పట్టణ సీఐ పుల్లయ్యకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలాం , నగర అధ్యక్షుడు గోళ్ల శ్రావణ్ కుమార్ రెడ్డి , ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, నగర ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శులు షామిర్ షా, ఇమ్రాన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సాయి ప్రసాద్ ఆచారి , వైవీ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
ఛాతీలో నొప్పి..
కుప్పకూలిన యువకుడు
గుత్తి రూరల్: బసినేపల్లికి చెందిన కుమార్ (35) శనివారం ఇంట్లో కుప్పకూలి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన కుమార్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రోజువారీగా ట్రాక్టర్‌కు వెళ్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స చేయగా, కోలుకోవడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికెళ్లిన తర్వాత మరోసారి కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుత్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మనస్తాపంతో బాలిక బలవన్మరణం
యాడికి: మండల కేంద్రంలోని అంకాలమ్మ వీధిలో మల్లిక (16) ఉరివేసుకొని శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు , స్థానికులు తెలిపిన మేరకు.. అంకాలమ్మ వీధిలో నివసిస్తున్న కుమారస్వామి, సునీత దంపతులకు ముగ్గురు కుమార్తెలు.చిన్న కుమార్తె మల్లిక గతేడాది పదోతరగతిలో రెండు సబ్జెక్టులు తప్పింది. వారం రోజుల క్రితం బంధువుల ఊరికి వెళ్లిన మల్లిక.. శనివారం యాడికికి వచ్చింది. వారం రోజుల తర్వాత ఇంటికొచ్చిన మల్లికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఉరికి వేలాడుతున్న ఆమెను కిందకు దింపి, ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
మాటలు కలిపి మస్కా
● వృద్ధురాలి మెడలో
బంగారు గొలుసు అపహరణ
అనంతపురం సెంట్రల్: తన మిత్రుడు ఇక్కడ అద్దెకు ఉంటున్నాడు.. మీకేమైనా తెలుసా అంటూ వృద్ధురాలితో మాటలు కలిపిన ఓ దొంగ అదను చూసి 5.5 తులాల బంగారు గొలుసు అపహరించిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు...నగరంలో రెండో రోడ్డులోని జెడ్‌క్రాస్‌లో ప్రమతనాథ శర్మ భార్య సావిత్రమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఉండగా.. ఆమె వద్దకు ఓ దొంగ వచ్చాడు. తన మిత్రుడు ఇక్కడ ఉన్నాడని మాటలు కలిపాడు. తనకు తెలియదని చెప్పి వృద్ధురాలు వెనుతిరుగుతుండగా, ఆమె మెడలోని గొలుసు అపహరించాడు. కుటుంబ సభ్యులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


