అనంతపురం టౌన్: డాక్యుమెంట్ రైటర్ల పొట్టకొట్టే జీఓ396ను వెంటనే రద్దు చేయాలని ఏపీ డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యా లయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటర్లకు తీవ్ర నష్టం చేసే విధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అన్యాయమ న్నారు. ఇకపై తమ కుటుంబ జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు వర్దిరెడ్డి నాగార్జున రెడ్డి, సుధాకర్, వేణుగోపాల్, హరినాథ్‌బాబు, చంద్రశేఖర్, జగదీశ్వరప్రసాద్ పాల్గొన్నారు.
బెట్టింగ్ అప్పు తీర్చలేక
కృష్ణా నదిలో దూకాడు
విజయవాడ: పరీక్షలు, ఫీజులు, పుస్తకాలంటూ తల్లిదండ్రుల నుంచి తీసుకున్న మొత్తాన్నీ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఈసారైనా వస్తుందన్న ఆశతో అప్పులు చేశాడు. చివరకు వాటిని తీర్చే మార్గం కనిపించక సోమవారం కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మనోహర్ అనే యువకుడు అమలాపురంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ చదువుతు న్నాడు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడి అప్పుల పాల య్యాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో వాటిని తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం అమలాపురం నుంచి విజయవాడకు వచ్చాడు. నేరుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి కృష్ణానది ఎగువ ప్రాంతంలోని నీటిలోకి దూకాడు. ప్రాణభయంతో కృష్ణానది లాకులు పట్టుకుని ‘రక్షించండి’ అంటూ కేకలు వేశాడు. గమనించిన స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి మనోహర్‌ను రక్షించారు.


