అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో వాతావ‘రణం’ మధ్య వరుణుడు దోబూచులాడుతున్నాడు. నాలుగు రోజులుగా మేఘాలు కమ్ముకుంటున్నా తేలికపాటితో సరిపెడుతున్న పరిస్థితి నెలకొంది. కల్లోలంగా మారిన ఖరీఫ్ కాసింత కుదుటపడాలంటే జూలై వర్షాలు కీలకమైనా కరుణించే పరిస్థితి కనిపించడం లేదు. జూలై నెలలో 68.4 మి.మీ సాధారణం కాగా సోమవారం నాటికి 43 మి.మీ నమోదు కావాలి. అయితే కేవలం 8.7 మి.మీ తేలికపాటికే పరిమితమైంది. జూలై 19న మాత్రమే 5.1 మి.మీ సగటుతో ఒకే ఒక్క రోజు వర్షపు దినం (రెయినీడే) నమోదు కావడం చూస్తే తీవ్ర వర్షాభావ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో వరుణదేవా కరుణించు అంటూ ఆకాశం వైపు చూస్తూ రైతులు వేడుకుంటున్నారు. గాడిదలు, కప్పలకు పెళ్లిళ్లు చేస్తూ గ్రామాల్లో ఊరేగిస్తూ పూజలు చేస్తున్నారు. రామభజనలు, విరాటపర్వం, వరుణయాగం, గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
32 మండలాల్లోనూ వర్షాభావం..
జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదైనా జూలైలో వరుణుడి జాడ లేకపోవడంతో 32 మండలాల్లోనూ బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని మండలాల్లోనూ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదయ్యాయి. మూడు నాలుగు రోజులుగా భారీ వర్షం కురిసేలా మేఘాలు ఆవరించినా 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులకు చెదిరిపోతున్నాయి. ఉరవకొండ, శింగనమల, గార్లదిన్నె, పామిడి, యాడికి మండలాల్లో మోస్తరుగానూ పెద్దవడుగూరు, తాడిపత్రి, కూడేరు, యల్లనూరు, అనంతపురం, బుక్కరాయసముద్రం, గుంతకల్లు, రాయదుర్గం, బ్రహ్మసముద్రం తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మిగతా మండలాల్లో గాలిచినుకులు పడ్డాయి. కుందుర్పి, కంబదూరు, ఆత్మకూరు తదితర ఐదారు మండలాలను జూలైలో వరుణుడు పలకరించకపోవడం గమనార్హం. జూన్ 7, 13, 14, 26 తేదీల్లో కురిసిన వర్షాలకు లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. నెల రోజులుగా వర్షం లేకపోవడంతో దాదాపు ఎండుముఖం పట్టాయి. ఓవరాల్‌గా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 104.2 మి.మీ గానూ 26 శాతం లోటుతో 77.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అందులో జూన్ 15 వరకు 65 మి.మీ నమోదు కాగా, ఆ తర్వాత గత 35 రోజుల్లో కేవలం 12 మి.మీ వర్షం కురిసింది. గుత్తి, తాడిపత్రి, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, పుట్లూరు, యల్లనూరు మండలాలు ఖరీఫ్ ఆరంభం నుంచి తీవ్ర వర్షాభావ జాబితాలో కొనసాగుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి దయనీయంగా మారుతుండటంతో రైతు ఇంట తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏడెనిమిది మండలాల్లో తేలికపాటి వర్షం
కీలకమైన జూలైలో 19న
ఒక్కటే రెయినీడే నమోదు
వర్షం కోసం గాడిదల పెళ్లిళ్లు,
వరుణయాగం చేస్తున్న రైతులు


