అనంతపురం న్యూటౌన్: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నగరంలోని జేఎన్‌టీయూలో ఉన్న ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం ‘షైనింగ్ స్టార్స్– 2026’ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతి విద్యార్థులు 192 మంది, ఇంటర్ విద్యార్థులు 38 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున నగదు, సర్టిఫికెట్, మెడల్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ తదితరులు పాల్గొన్నారు.
భగవంతుడు సహకరిస్తే తప్ప బయటపడలేం
భగవంతుడు సహకరిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడలేమని, ‘ఎల్–నినో’ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ మాట్లాడుతూ హెచ్‌ఎల్‌సీ పరిధిలో అధికారులు విధులకు గైర్హాజరు కాకూడదన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఓ.ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


