ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే | - | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో గతంలో జరిగిన భారీ దొంగతనాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాజాగా మోటారు రిపేరీ వ్యవహారంలో మాత్రం వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంకె నరేంద్రపై అక్రమంగా దొంగతనం కేసు నమోదు చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీల్లోని నిర్మాణ సామగ్రి, మోటర్లు సహా అన్ని వస్తువులు ఇప్పటికీ కాంట్రాక్టర్‌ ఆధీనంలోనే ఉన్నాయని, ప్రభుత్వం ఇంకా వాటిని స్వాధీనం చేసుకోలేదన్నారు. తుది కొలతలు పూర్తి చేసి, ఫైనల్‌ బిల్లులు చెల్లించిన తర్వాతే అవి ప్రభుత్వ ఆస్తిగా మారతాయని, ప్రస్తుతం కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌ లో ఉన్నాయని తెలిపారు. ‘కాంట్రాక్టర్‌ అనుమతితోనే మోటారును రిపేరీ కోసం తీసుకెళ్లారు. తోటలో టెస్టింగ్‌ చేసి మళ్లీ అదే చోట బిగించారు. అనంతరం పోలీసులు వచ్చి నరేంద్ర సమక్షంలో మోటారును బయటకు తీసి స్టేషన్‌కు తరలించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చూపిస్తూ దొంగతనం కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు’ అని ఆయన విమర్శించారు. ‘కాంట్రాక్టర్‌ పరిధిలో ఉన్న ఆస్తిపై ఇతరులు ఎలా ఫిర్యాదు చేస్తారు? అలాంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారు?‘ అని ప్రశ్నించారు. గతంలో ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో హౌసింగ్‌, కాంట్రాక్టర్‌కు చెందిన ఐరన్‌, సిమెంట్‌, ఇసుక, కంకర, డస్ట్‌, సెంట్రింగ్‌ సామగ్రి, ఐరన్‌ కుర్చీలు తదితర వస్తువులను లోడ్ల కొద్దీ తరలించారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన నిర్మాణ సామగ్రి తరలిపోయిందని, కొందరు బహిరంగంగానే గుజరీలకు విక్రయించారని తెలిపారు. ఈ ఘటనలపై పలు సందర్భాల్లో ఫొటో ఆధారాలతో పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయని, స్వయంగా పోలీసులు, హౌసింగ్‌ అధికారులు కొన్ని సందర్భాల్లో పట్టుకున్నప్పటికీ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయలేదని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆలమూరు జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య 20 నుంచి 30 అడుగుల లోతులో గుంతలు తవ్వి ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకున్న వారిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. నరసనాయనికుంట లోని పలువురు టీడీపీ నాయకుల ఇళ్లలో ఇప్పటికీ జగనన్న కాలనీకి చెందిన నిర్మాణ సామగ్రి కనిపిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోయినా, కాంట్రాక్టర్‌ అనుమతితో మోటారును రిపేరీ చేయించి టెస్టింగ్‌ చేసిన నరేంద్రపై దొంగతనం కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ కక్షసాధింపు తప్ప మరొకటి లేదన్నారు. అక్రమ కేసు పెట్టడంతో నరేంద్ర తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించారని ఆయన తెలిపారు.

జగనన్నకాలనీల్లో కోట్ల రూపాయల సామగ్రి తరలిపోయినా కేసుల్లేవ్‌

మోటారు రిపేరీ వ్యవహారంలో అంకె నరేంద్రపై అక్రమ కేసు

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement