తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలంలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు అంశం అటకెక్కింది. గత ఏడాది జూన్‌లో మండలంలోని తలారిచెరువు, భోగసముద్రం గ్రామాల పరిధిలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి కలెక్టర్ వినోద్‌కుమార్, ఆ తర్వాత జూలై 2న కేంద్ర ప్రభుత్వ సంస్థ బీబీఎస్‌ఎస్‌ఐకి చెందిన ప్రతినిధులు పరిశీలించారు. భూమి శ్యాంపిల్స్, నీటి పరీక్షల నివేదికలను తీసుకెళ్లిన వారు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు భూములు అనువుగా లేవని,వేరే చోట పరిశీలించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ ఆనంద్ తాడిపత్రి మండలంలోని బుగ్గ, తలారిచెరువు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూములు దొరకడమే కష్టంగా మారిన ప్రస్తుత తరుణంలో అనువైన భూముల పేరుతో కాలయాపన చేయడం చూస్తుంటే అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యేనా అనే సందేహం కలుగుతోంది.
ఎన్నో ఆశలు..
తాడిపత్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున అరటి పంటను సాగు చేస్తున్నారు. 12 వేలకు పైగా హెక్టార్లలో అరటి సాగులో ఉంది. ఏడాదికేడాదికీ అరటి సాగు పెరుగుతోంది. నాణ్యమైన అరటి పిలకలు దొరక్కపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటైతే నాణ్యమైన పిలకలు లభిస్తాయని, రవాణా ఖర్చులు తగ్గుతాయని ఆశలు పెంచుకున్న రైతులు.. ఏడాది దాటినా పనులు ముందుకు సాగకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భూములు పరిశీలిస్తున్నాం
తాడిపత్రి మండలంలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ చేస్తున్నాం. భోగ సముద్రం, తలారిచెరువు గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమిని కలెక్టర్, కమిటీ సభ్యులు పరిశీలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మరి కొన్ని భూములు పరిశీలనలో ఉన్నాయి.
– ఉమాదేవి, ఉద్యాన శాఖ అధికారి


