జూటూరుకు అరుదైన గౌరవం | - | Sakshi
Sakshi News home page

జూటూరుకు అరుదైన గౌరవం

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

మహారాష్ట్ర నాలుగో తరగతి తెలుగు పాఠ్యాంశంలో తులసీదాసు కథకు చోటు

అనంతపురం ఎడ్యుకేషన్‌: అనంతపురానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత జూటూరు తులసీదాసుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రచించిన ‘సంఘీభావం’ కథను మహారాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన నాలుగో తరగతి తెలుగు పాఠ్యాంశంలో చేర్చింది. జూటూరు తులసీదాసు బాలసాహిత్య రంగంలో ఖ్యాతి గడించారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా, వారికి సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో అనేక కథలు, గేయాలు రచించి పుస్తకాల రూపంలో అందించారు. ఆయన రచనలు విద్యార్థుల్లో విలువలు, మానవీయత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేలా ఉంటాయని సాహితీవేత్తలు పేర్కొంటున్నారు. విద్యా, సాహిత్య రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా జూటూరు తులసీదాసుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. తాజాగా ఆయన రచన మహారాష్ట్ర పాఠ్యాంశంలో చోటు దక్కించుకోవడం పట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

‘టెట్‌’ మినహాయించాలి

అనంతపురం అర్బన్‌: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయించాలని వైఎస్సార్‌టీఏ నాయకులు డిమాండ్‌ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌కు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు గోవిందరెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధరరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. టెట్‌ అమలులోకి రాకముందే చట్టబద్ధంగా పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి నియమితులైన ఉపాధ్యాయులు ప్రస్తుత టెట్‌ నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికి అమలులో ఉన్న ప్రభుత్వ నియామక విధానాలు, అర్హతల మేరకు వారు విద్యాసేవలు అందిస్తున్నారని చెప్పారు. చట్టబద్ధ నియామకాలపై కొత్త నిబంధనలను ప్రతికూలంగా వర్తింపజేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. పార్లమెంట్‌లో చట్ట సవరణ ద్వారా టెట్‌ అమలుకు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలన్నారు. టెట్‌తో సంబంధం లేకుండా సీనియర్‌ ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతి కల్పించాలన్నారు. చట్ట సవరణ జరిగే వరకు సంబంధిత ఉపాధ్యాయులు ఎటువంటి ప్రయోజనాలు కోల్పోకుండా, ఎలాంటి ప్రతికూల పరిపాలనా నిర్ణయాలు తీసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

టీబీ డ్యాంలో

25.77 టీఎంసీల నీరు

బొమ్మనహాళ్‌: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం డ్యాంలో 25.77 టీఎంసీల నీరు ఉంది. ఇటీవల బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు నారుమళ్లు, ఎండుమిర్చి, పత్తి పంటలు విత్తుకున్నారు. టీబీ జలాశయం నుంచి నీరు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే, మొన్నటి వరకు ఊరించిన వరద ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 79.90 టీఎంసీల నీరు నిల్వ ఉండి 38,079 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 39,009 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement