నిన్ను నమ్మం బాబు | - | Sakshi
Sakshi News home page

నిన్ను నమ్మం బాబు

Jul 21 2026 12:53 AM | Updated on Jul 21 2026 12:53 AM

ఎన్నికలకు ముందు జీవో నంబర్‌ 3 పునరుద్ధరణకు హామీ ● అధికారంలోకి వచ్చాక ఆ ఊసేత్తని సీఎం చంద్రబాబు ● ప్రత్యామ్నాయ జీవో కూడా ఉత్తిదే ● రెండేళ్లుగా కాలయాపన ● నూరుశాతం ఉద్యోగాలు కోల్పోతున్న గిరిజనులు ● అరకు ఎన్నికల ప్రచారం సాక్షిగా వంచన ● ఆదివాసీల ఉద్యమం పట్టని కూటమి ప్రభుత్వం

సాక్షి, పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మారాయి. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు 2024 జనవరి 20వ తేదీన అరకు సంతబయలు ప్రాంతంలో రా కదలి రా పేరిట ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. నూరుశాతం గిరిజనులకు ఉద్యోగాలు వర్తించే జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోతో న్యాయం చేస్తానని ఈ సభలో చంద్రబాబు ప్రకటించారు. గిరిజనులంతా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా సీఎం హామీని విస్మరించారు. దీంతో నిన్ను నమ్మం బాబు అంటూ గిరిజనులంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. జీవో సాధన కోసం భారీ ఎత్తున పోరాటాలు చేస్తున్నారు.

గిరిజనుల ఉద్యమం పట్టని సీఎం

జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోను తెచ్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గత రెండేళ్లుగా గిరిజనులు ఉద్యమాలు చేస్తున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదు. గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబు మాట మరచి గత ఏడాది జనరల్‌ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో కేవలం ఆరుశాతం ఉద్యోగాలు మాత్రమే గిరిజనులకు దక్కాయి. మిగిలిన పోస్టుల్లో గిరిజనేతరులే ఎంపికయ్యారు. డీఎస్సీ ప్రకటనకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పాడేరుతో పాటు అన్ని ఐటీడీఏల పరిధిలో అన్ని ఆదివాసీ ప్రజాసంఘాలు, గిరిజన నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండానే డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి వేలాది మంది గిరిజన అభ్యర్థులకు అన్యాయం చేసింది. సీఎం చంద్రబాబు వైఖరిపై ఆగ్రహంతో ఉన్న గిరిజనులంతా జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధి లో ఐక్య ఉద్యమాలతో హోరెత్తిస్తున్నారు. ఆదివాసీ ప్రజా సంఘాల ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ కూడా సంపూర్ణ మద్దతునిస్తోంది. అరకుఎంపీ డాక్టర్‌ తనూజరాణి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,పఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,అరకు ఎమ్మె ల్యే రేగం మత్స్యలింగం,ఎమ్మెల్సీ కుంబా రవిబాబు,ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రతో పాటు నేతలంతా ఆదివాసీ ప్రజా సంఘాలు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement