బతుకు బండి లాగుతున్న థింసా వనితలు!
అరకు పైనరీలో థింసా నృత్యం చేస్తున్న గిరిజన మహిళలు
డుంబ్రిగుడ: కాఫీ సువాసనల మధ్య అందాల అరకులో అడుగుపెడితే చాలు.. గిరిజన మహిళల గజ్జెల చప్పుడు పర్యాటకులను మైమరిపిస్తుంది. లయ తప్పని వారి నృత్య విన్యాసాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. కానీ, ఆ ఆనందాల కేరింతల వెనుక... పొట్టకూటి కోసం ఆ తల్లులు పడుతున్న కఠినమైన నిశ్శబ్ద పోరాటం ఎందరికి తెలుసు..తరతరాల ఆదివాసీ సంస్కృతికి ప్రతీక అయిన థింసా నృత్యాన్ని ఇప్పుడు కొందరు గిరిజన మహిళలు కేవలం పండగలు, పబ్బాలకే పరిమితం చేయలేదు. దానినే తమ కుటుంబాలను సాకే ప్రధాన ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. అరకులోని వ్యూపాయింట్లు, కాఫీ తోటల వద్దకు వచ్చే పర్యాటకులే లక్ష్యంగా వీరంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. సందర్శకులకు తమ సంప్రదాయ నృత్యంతో ఘన స్వాగతం పలుకుతూ వినోదాన్ని పంచుతున్నారు. అలా పర్యాటకుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూనే, తమ ఇళ్లల్లో దినదిన గండంగా మారిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
● మనం కేవలం క్షణాల పాటు ఆస్వాదించి వదిలేసే ప్రతి కళా ప్రదర్శన వెనుక ఎన్నో కఠినమైన వాస్తవాలు దాగుంటాయి. ఆ ముఖంపై మెరిసే చిరునవ్వుల వెనుక వారి కుటుంబాల ఆర్థిక భారమెంతో లోతైనది. తమ అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూనే, ఉపాధి కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న ఈ మహిళా కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు దక్కాలి. ప్రభుత్వ, పర్యాటక శాఖలు వీరికి ప్రత్యేక ఉపాధి అవకాశాలు, ఆర్థిక చేయూతనిస్తే.. కళను నమ్ముకున్న ఈ గిరిజన బిడ్డల బతుకుల్లోనూ నిజమైన వెలుగులు నిండుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


