కడుతుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్
ముంచంగిపుట్టు: మండలంలోని పనసపుట్టు పంచాయతీ కడుతుల మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చెండా దయనిధిని సెబుగూడ పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపడం తగదని తొమ్మిది గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కడుతుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమై, ఉపాధ్యాయుని డిప్యూటేషన్ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె. విఘ్నేష్, వైస్ చైర్మన్ సుశీల, పీసా కమిటీ కార్యదర్శి కె. రామదాసు, నాయకులు కె. రామనాయుడు, కె. శంకర్ మాట్లాడుతూ... కడుతుల పాఠశాలలో 72 మంది విద్యార్థులు ఉన్నారని, నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తూ పిల్లలకు సక్రమంగా విద్యనందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో ఒక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై మరో పాఠశాలకు పంపడం విద్యాశాఖ అధికారుల ఆనాలోచిత నిర్ణయమని విమర్శించారు. పాఠశాలలో విద్యార్థులు చదువుకునేందుకు తగినన్ని గదులు లేకపోవడంతో, గ్రామస్తులంతా కలిసి చందాలు వేసుకొని ప్రత్యేకంగా పాకలు నిర్మించుకున్నామని వారు గుర్తుచేశారు. తమ పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుడి డిప్యూటేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు రాంబాబు, కృష్ణ, రమదేవ్, నాగేష్, చంద్రకళ, జోగ్గో, గణపతి, రామమూర్తి, ప్రసాద్, పరశురాం పాల్గొన్నారు.


