పెదబయలులో కదం తొక్కిన గిరిజనం | - | Sakshi
Sakshi News home page

పెదబయలులో కదం తొక్కిన గిరిజనం

Jul 21 2026 12:53 AM | Updated on Jul 21 2026 12:53 AM

పెదబయలు: తమ హక్కులు, చట్టాలకు రక్షణ క ల్పించాలని డిమాండ్‌ చేస్తూ పెదబయలులో సోమ వారం గిరిజనులు కదం తొక్కారు. ఉపాధ్యాయ పోస్టుల్లో శత శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో 3ని పునరుద్ధరించాలని, గిరిజనుల భూములకు రక్షణగా ఉండే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు చెందిన అధిక సంఖ్యలో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెదబయలు జంక్షన్‌, తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ ఆత్మగౌరవ ర్యాలీ, నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. జిల్లా పరిషత్‌ మైదానం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో వేలాదిమంది ఆదివాసీలు పాల్గొన్నారు. సేవ్‌ మన్యం,సేవ్‌ 1/70 చట్టం అంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జేఏసీ కన్వీనర్‌ రామారావు దొర మాట్లాడుతూ రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్‌ కల్పించిన హక్కులు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించా రు. ఆదివాసీలకు ఈ ప్రాంతంలో 100 శాతం ఉపాధి కల్పించే జీవో నంబర్‌ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని, గిరిజన ప్రాంతంలో ఇప్పటికే 1/70చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారని తెలిపారు. గిరిజన చట్టాలు కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ర్యాలీలో మైక్‌లో మాట్లాడానికి అనుమతి ఇచ్చేందుకు కూడా ఇబ్బందులకు గురిచేయడంపై వారు మండిపడ్డారు. తహసీల్దార్‌ కార్యాలయంలోనికి అనుమతించకుండా గిరిజనులను గేటుబయటే నిలిపివేయడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల గొంతు నొక్కేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామారావు దొర,అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మసాడి ఈశ్వరరావు, మండల అధ్యక్షుడు తలారి చక్రదర్‌,స్థానిక జెడ్పీటీసీ కూడ బొంజుబాబు, అఖిల పక్షం నేతలు రేగం చాణక్య, సల్లంగి ఉమామహేశ్వరరావు, జర్సింగి గంగాభవాని, గంపరాయి సూరయ్య, బొండా సన్నిబాబు, తెడబారికి సురేష్‌కుమార్‌, కె.బొంజుబాబు, మాధవరావు,జగబందు,ఎంఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సేవ్‌ మన్యం, సేవ్‌ 1/70 చట్టం అంటూ

భారీ ఎత్తున నినాదాలు

వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు

ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం : ఉమ్మడి విశాఖ జెడ్పీచైర్‌పర్సన్‌ సుభద్ర, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement