‘సర్’ ప్రక్రియ వేగవంతం
● కలెక్టర్ నిశాంతి ఆదేశాలు
సాక్షి,పాడేరు: జిల్లాలోని 624 పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టి.నిశాంతి సోమవారం ఓ ప్రకటనలో అధికారులను ఆదేశించారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాలకు సంబంధిచి దాదాపు 4,99,752 ఫారాలకు పాత జాబితాతో మ్యాపింగ్ కాలేదని, ఆయా పనులన్నీ తక్షణమే సరిచేయాలని పేర్కొన్నారు. డేటా లోపాలున్న 11,933 ఫారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వెంటనే సరిదిద్దాలన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు సంబంధించి 544 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వారి తల్లిదండ్రులు, వారసుల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఓటర్ల ఫొటోల నాణ్యతలోను ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బ్లాక్ అండ్ వైట్ ఫొటోల స్థానంలో కొత్త కలర్ ఫొటోలను అప్‌డేట్ చేయాలని ఆమె ఆదేశించారు.ఎన్నికల విధులను గడువులోగా పూర్తి చేయాలని, ఎక్కడ నిర్లక్ష్యం వహించినా, గడువు దాటినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
సాక్షి,పాడేరు: కేంద్ర యువజన వ్యవహారాలు,క్రీడల మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న మేరా యువభారత్‌ను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లాలో యువత అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపైన ఆమె సమీక్షించారు. స్వచ్ఛంద సేవా సంస్థల కార్యక్రమాల విస్తరణ, యువజన సంఘాల బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి, క్రీడా పరికరాల పంపిణీ, క్రీడా పోటీల నిర్వహణ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలుశాఖల అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు పాల్గొన్నారు.


