వందేళ్ల భారతీయ కథా సంకలనంలో వేంపల్లె షరీఫ్ కథ
వేంపల్లె : భారతదేశంలో గత వందేళ్లలో వచ్చిన వంద ఉత్తమ కథల సంకలనంలో జిల్లా వాసి వేంపల్లె షరీఫ్ రాసిన ‘ఒంటి చెయ్యి’ అనే కథకు స్థానం దక్కింది. ముంబైలోని ప్రపంచ ప్రఖ్యాత పుస్తక ముద్రణా సంస్థ అలేఫ్ గత వందేళ్ల భారతీయ కథా సాహిత్యంలో వచ్చిన వంద కథలతో వంద భారతీయ కథలు పేరుతో సంకలనాన్ని తీసుకొచ్చింది. కేరళ వాసి అయిన ప్రఖ్యాత కవి, అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ది ఇండియా లిటరెట్ పత్రిక పూర్వ సంపాదకుడు ఏజె థామస్ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. ప్రస్తుతం అమెజాన్‌న్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఈ పుస్తకంలో ప్రపంచ ప్రసిద్ధ భారతీయ రచయితలైన రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్ చంద్, శరత్ చంద్ర ఛటర్జీ, సుబ్రమణ్య భారతి, కె.ఎం మున్షీ, కువెంపు, ఆర్కే నారాయణ్, ఇస్మాత్ చుగ్తాయ్, కుష్వంత్ సింగ్, సత్యజిత్ రే, మహాశ్వేత దేవి, రస్కిన్ బాండ్, ప్రతిభారే, శశిథరూర్ తదితర ఉద్ధండుల కథలు ఉన్నాయి. వీరి సరసన తెలుగు నుంచి చలం, కవన శర్మ, సయ్యద్ సలీం, తురగా జానకీ రాణి, వేంపల్లె షరీఫ్ కథలకు స్థానం కల్పించారు. షరీఫ్ 2015 లో రాసిన ‘ఒంటి చెయ్యి’ కథను బెంగళూరుకు చెందిన ప్రముఖ అనువాదకుడు ఎన్.ఎస్.మూర్తి సిరిప్రిలిడ్ వరల్డ్ పేరుతో ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. ప్రస్తుతం తన కథకు ఇంతటి గౌరవం దక్కడంపట్ల షరీఫ్ ఆనందం వ్యక్తం చేశారు.


