మైదుకూరు : మైదుకూరులో బాలిక అదృశ్యంపై సోమవారం ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. తన మనవరాలు పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉండేదని, సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, బాలిక ఆచూకీ తెలియజేయాలని కోరుతూ బాలిక నాయనమ్మ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చక్రాయపేట : ఎలాంటి బిల్లులు లేకుండా వేరుశనగ పప్పును తీసుకెళుతున్న లారీని విజిలెన్స్ సీఐ పట్టుకొని చక్రాయపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. యల్లటూరు నుంచి వేరుశనగ పప్పుతో కదిరి వైపు వెళుతున్న లారీని అద్దాలమర్రి క్రాస్ వద్ద విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి పట్టుకున్నారు. పప్పునకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేసి లారీని చక్రాయపేట స్టేషన్‌కు అప్పగించారు. ఈ విషయమై చక్రాయపేట ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను అడగగా.. విజిలెన్స్ సీఐ పప్పు శనగ లారీ పట్టుకుని అప్పగించారని తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
మైలవరం (జమ్మలమడుగు రూరల్) : గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలవరం మండలంలో చోటు చేసుకొంది. ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన దాసుగారి రాజా (64) గత 5 ఏళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. అంతే కాకుండా మానసిక పరిస్థితి బాగ లేకపోవడంతో పలుమార్లు ఇంటి నుంచి బయటికి వెళ్లేవాడు. సోమవారం కూడా అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రం మైలవరం జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ప్రైవేట్ బస్సు ఢీకొని
ఇద్దరికి గాయాలు
గుత్తి రూరల్ : ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రఘురామయ్య, నంద్యాల జిల్లా గోరుమానుపల్లికి చెందిన చెక్క శివయ్యలు సోమవారం వైఎస్‌ఆర్ కడప జిల్లాకు బైక్‌లో బయలుదేరారు. కొత్తపేట గ్రామ శివారులో వీరి బైక్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రఘురామయ్య, శివయ్యను స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురం తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ముద్దనూరు : స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో వున్న స్మార్ట్ కిచెన్ సెంటర్ షెడ్‌లోని విద్యుత్ వైరు చోరీ జరిగింది. నిర్మాణంలో వున్న భవనంలో కొద్ది రోజుల క్రితం విద్యుత్ వైరింగ్ పనులు చేపట్టారు. ఆదివారం రాత్రి పైప్‌లలో నుంచి వైరును లాగి దొంగలించినట్లు అధికారులు సోమవారం గుర్తించారు. భవనంలో విద్యుత్ వైరింగ్ ప్రక్రియ అంతా పూర్తయింది. స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన సమయంలో చోరీ జరిగినట్లు, దొంగలించిన వైరు విలువ సుమారు రూ.60 వేల వరకు వుంటుందని అంచనా వేశారు.


