● కష్ట కాలంలో పార్టీకి అండగా
నిలబడిన వారికే భవిష్యత్
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం అవంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రచార విభాగంపై ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రచార విభాగం సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, పార్టీ అఽధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రచార విభాగం సభ్యులపై ఉందన్నారు. అలాగే పార్టీ విధి విధానాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పోరాటాలను ప్రజలకు ప్రచారం చేయాలన్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఈ అంశాలను గణాంకాలతో ప్రజలకు తెలపాలన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికే భవిష్యత్ ఉంటుందని, గతంలో జరిగిన పొరపాట్లు ఈ సారి జరగవన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకే పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు. ప్రచార విభాగం జోన్–5 అధ్యక్షుడు సీహెచ్ వినోద్ కుమార్ మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు మహబూబ్ బాష, నగర అధ్యక్షుడు మహేష్‌రెడ్డి, జిల్లా నాయకులు రంగ నాయకులు, నిస్సార్ బాష, రమణారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.


