కమలాపురం : నష్ట పరిహారం చెల్లించకుండానే ఆర్‌ఓబీ పనులు ఎలా ప్రారంభిస్తారని భూ బాధితులు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. కమలాపురం పట్టణంలో రైల్వే గేటుకు ఒక వైపున ఆర్‌ఓబీ పనులు జరుగుతున్న విషయం విదితమే. అయితే రెండో వైపు కూడా పిల్లర్ గుంతలు కొట్టాలని కాంట్రాక్టర్ జేసీబీతో రోడ్డు పగులగొట్టేందుకు సిద్ధం అయ్యారు. దీంతో బాధితులంతా అక్కడికి చేరుకుని తమకు నష్ట పరిహారం అందించకుండానే ఎలా పనులు చేస్తారని ప్రశ్నించారు. పనులు ఆపాలని, నష్ట పరిహారం అందించాకే పనులు ప్రారంభించాలని బాధితులు భీష్మించుకు కూర్చోవడంతో జేసీబీ వెనక్కు వెళ్లింది. దీంతో బాధితులంతా తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు ఇంత వరకు నష్ట పరిహారం రాలేదని, మరి పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. 2–3 రోజుల్లో డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయని, ఆర్‌ఓబీ నిర్మాణానికి సహకరించాలని తహసీల్దార్ కోరారు. ఐదేళ్ల నుంచి ఈ తంతు జరుగుతోందని తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని గట్టిగా చెప్పడంతో.. అర్జీ రాసివ్వాలని ఆర్‌డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ చెప్పడంతో బాధితులు అర్జీ రాసిచ్చారు.
కాంట్రాక్టర్‌ను ప్రశ్నించిన బాధితులు


