కడప ఎడ్యుకేషన్ : శ్రీకాకుళం వైఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో వైఎస్‌ఆర్ కడప జిల్లా టీం సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల నుంచి 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కడప జిల్లా నుంచి 36 మంది పాల్గొని 22 పతకాలు సాధించగా, అందులో 7 బంగారు, 7 రజిత, 8 కాంస్య పతకాలు ఉండగా.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో 3వ స్థానం సాధించిందని మాస్టర్ నాయబ్ రసూల్ తెలిపారు. వీరు అక్టోబర్ 1 నుంచి 3 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనుటకు అర్హత సాధించారని చెప్పారు. వీరిని జిల్లా తైక్వాండో ప్రెసిడెంట్ శివశంకర్‌రెడ్డి అభినందించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహ బహుమతులు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో ట్రెజరర్ రంగస్వామి, సీనియర్ కోచ్ నరసింహ ప్రసాద్, శ్రీరామ్ విజయ్ పాల్గొన్నారు.
లెక్చరర్ల ఉద్యమ నేత కన్నుమూత
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రముఖ విద్యావేత్త సి.సుబ్బరామిరెడ్డి ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణం ఇంటర్ విద్యారంగానికి, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల సంఘాలకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా దేవగుడి గ్రామానికి చెందిన సుబ్బరామిరెడ్డి 1975లో రైల్వేకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతికశాస్త్ర లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతపురం న్యూ టౌన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీపై వచ్చిన అనంతరం జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందిన ఆయన జిల్లాలో సుదీర్ఘ కాలం పని చేశారు. రాష్ట్ర జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘానికి సుబ్బరామిరెడ్డి నాయకత్వం వహించారు. 2007లో పెనుకొండలో పని చేస్తూ పదవీ విరమణ చేశారు. లెక్చరర్ల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా, విద్యారంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన విద్యావేత్తగా ఆయన సేవలు చిరస్మరణీయమని లెక్చరర్లు పేర్కొన్నారు.
మంత్రం, తంత్రం పేరుతో బురిడీ
– రూ.80 వేల బంగారం అపహరణ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కొత్తపల్లె గ్రామంలో మంత్రం తంత్రం పేరుతో వేలాది రూపాయలు విలువ చేసే బంగారం చోరీకి యత్నించిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన అల్లా బకాష్ కుమారుడు అలీఫ్‌కు.. మాయ మంత్రాల పేరుతో గ్రామంలోకి ప్రవేశించిన పకీరు మాయమాటలు చెప్పాడు. మత్తు మందు ఇచ్చి రూ.80 వేల విలువ గల బంగారు ఉంగరాన్ని చోరీ చేశాడు. ఉంగరం కనిపించకపోవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పకీరు కోసం గాలించి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ శ్రీరామ్ కొత్తపల్లె గ్రామానికి వెళ్లి పకీరును అదుపులోకి తీసుకున్నారు.


