యాదగిరిగుట్ట : భారత్– అమెరికా దేశాల వాణిజ్య ఒప్పందాలతో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆరోపించారు. యాదగిరిగుట్టలో రాష్ట్ర రైతు సంఘం శిక్షణ శిబిరం ఆదివారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశంలోని 14 కోట్ల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాణిజ్య ఒప్పంద నిర్ణయాన్ని ప్రధాని మోదీ ఉపసంహరించుకోవాలన్నారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీటిని పంప్ చేయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. సాగు నీటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత తీసుకోవాలన్నారు. ఈనెల 28న ఢిల్లీలో జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భారత్– అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత రైతాంగానికి ఎంత ప్రమాదం ఏర్పడుతుందనే దానిపై చర్చ ఉంటుందన్నారు. 29న కార్మిక, రైతు సంఘాలు సంయుక్త కార్యక్రమాలపై జాతీయ స్థాయి సదస్సు ఉంటుందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు శరత్ బాబు, సాగునీటి నిపుణులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడు కొల్లూరి రాజయ్య పాల్గొన్నారు.


