యాదగిరిగుట్ట : వైటీడీ పాలకమండలి సభ్యుడిగా తూళ్ల విజయేందర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 11న పాలకమండలి చైర్మన్ ఎం. సత్యనారాయణరెడ్డితో పాటు 8 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, తూళ్ల విజయేందర్ ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఆదివారం తూళ్ల విజయేందర్ తన సతీమణి, కుమార్తెతో వచ్చి గర్భాలయ బంగారు వాకిలి వద్ద ఈఓ భవానీ శంకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈఓ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. అనంతరం తూళ్ల విజయేందర్ మాట్లాడుతూ.. వైటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల తిరుపతి స్థాయిలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.


