గుర్రంపోడు : కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధనకు దేశంలో మొట్టమొదట ఏర్పడిన సంఘం ఏఐటీయూసీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికలోకం పోరాటాన్ని తీవ్రతరం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పేద వారు మరింత పేదవారుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31 ఆవిర్భవించిన కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే కార్మిక చట్టం, పారిశ్రామిక విధానాల చట్టం, బిట్రీష్ సామ్రాజ్యవాదుల నుంచి భారతదేశాన్ని విముక్తి కోసం పోరాటాలు చేసిన గొప్ప సంఘమని చెప్పారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు మారలేదన్నారు. మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఎం.నర్సింహ, ఉజ్జిని రత్నాకర్‌రావు, ఎండీ ఇమ్రాన్, పల్లా దేవేందర్‌రెడ్డి, రామస్వామి, నాయకులు కేఎన్.రెడ్డి, నూనె వెంకటేశ్వర్లు, వెంకట్రావ్, వెంకన్న, రేపాక లక్ష్మీపతి, ఎస్‌కే అమీర్ తదితరులు పాల్గొన్నారు.


