వన్నె తరగని విద్యా వృక్షం | - | Sakshi
Sakshi News home page

వన్నె తరగని విద్యా వృక్షం

Jul 20 2026 1:56 AM | Updated on Jul 20 2026 1:56 AM

కాన్వొకేషన్‌ అపురూపమైన జ్ఞాపకం

రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా పేరొందిన నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) మరో అపూర్వ ఘట్టానికి వేదిక కాబోతోంది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ కళాశాల స్నాతకోత్సవాన్ని(కాన్వొకేషన్‌ డే) ఈ నెల 22న నిర్వహించనున్నారు.

1956లో ప్రారంభం..

1956 జూలై 22న అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చేతుల మీదుగా ఈ కళాశాల ప్రారంభమైంది. అప్పట్లో హైదరాబాద్‌లో నిజాం కళాశాలతో పాటు ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్‌, నల్లగొండలో కలిపి కేవలం ఐదు ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉండగా.. అందులో ఎన్జీ కళాశాల ఒకటి కావడం విశేషం. ఆచార్య నాగార్జునుడి స్ఫూర్తితో 29 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ప్రారంభమైన ఈ కళాశాల వేలాది మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి అగ్రగామిగా నిలిచింది. ఈ కళాశాలలో సీటు వస్తే గొప్ప వరంగా విద్యార్థులు భావిస్తారు. అత్యుత్తమ బోధనా ప్రమాణాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అధునాతన ల్యాబ్‌లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఎన్జీ కళాశాల సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడ చదివిన వారిలో ఇప్పటివరకు 25 మందికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులుగా ఎంపికయ్యారు. ఎంతో మంది శాస్త్రవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, ఉన్నతాధికారులుగా స్థిరపడ్డారు.

స్వయం ప్రతిపత్తితో ఉన్నత శిఖరాలకు..

2004 ఫిబ్రవరి 16న మొదటిసారి యూజీసీ న్యాక్‌ శ్రీబిశ్రీ గుర్తింపు పొందిన ఈ కళాశాల 2007–08 విద్యాసంవత్సరం నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) హోదాను దక్కించుకుంది. సిలబస్‌ రూపకల్పన, అకడమిక్‌ షెడ్యూల్‌, పరీక్షల నిర్వహణ తదితర విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ విద్యా ప్రమాణాలను మరింత పెంచింది. ప్రస్తుతం కళాశాలలో 18 యూజీ కోర్సులు, 6 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 4500 పైచిలుకు విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. డిజిటల్‌ లైబ్రరీ సదుపాయం కలదు. గ్రంథాలయంలో వేల కొలది పుస్తకాలు, జర్నల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

23 మందికి

బంగారు పతకాలు..

2024–25 విద్యా సంవత్సరంలో ఐదు పీజీ కోర్సులు, 2025–26 విద్యా సంవత్సరంలో 18 యూజీ కోర్సుల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి, అకడమిక్‌ విభాగాల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన 23 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. సుమారు 400 మంది విద్యార్థులు కాన్వొకేషన్‌ సర్టిఫికెట్‌ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తల చేతులమీదుగా బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవంలో పాల్గొనే విద్యార్థుల కోసం కళాశాల యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పట్టాలు స్వీకరించే విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులను కూడా ఈ వేడుకకు అనుమతిస్తారు.

22న ఎన్జీ కళాశాల

70వ వ్యవస్థాపక వేడుకలు

అదే రోజు స్నాతకోత్సవం

బంగారు పతకాలు అందుకోనున్న 23 మంది టాపర్లు

ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఎన్జీ కళాశాలకు ఉంది. ఈ కళాశాలను ప్రారంభించిన రోజునే స్నాతకోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంది. కష్టపడి చదివిన విద్యార్థులకు, వారిని చదివించిన తల్లిదండ్రులకు ఈ కాన్వొకేషన్‌ వేడుక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలన్నదే మా సంకల్పం. అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఈ వేడుకకు సగర్వంగా ఆహ్వానిస్తున్నాం.

– సముద్రాల ఉపేందర్‌, ప్రిన్సిపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement