ప్లాంట్ ఏర్పాటుకు ఎంతో శ్రమించారు
రామన్నపేట : చేనేత వస్త్రాల రంగుల అద్దకం ద్వారా వెలువడే రసాయన జలాల కాలుష్యానికి ఇక తెరపడనుంది. ఇందుకు రామన్నపేట మండలం సిరిపురం గ్రామం వేదికగా నిలిచింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్‌టీ) ఆర్థిక సహకారంతో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మించిన ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ట్రయల్ రన్ విజయవంతమైంది. ‘సిరిపురం మోడల్ ప్లాంట్’గా పిలిచే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఐఐసీటీ డైరెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డిల చేతుల మీదుగా గ్రామ పంచాయతీకి అప్పగించనున్నారు.
దేశంలోనే తొలి ప్లాంట్.. సిరిపురం మోడల్
సిరిపురం గ్రామం బెడ్‌షీట్లు, మెర్సైరెజ్డ్ (మస్‌రస్) చీరల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సగానికి పైగా కుటుంబాలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వస్త్రాల తయారీలో వివిధ డిజైన్ల కోసం రసాయన రంగులను వినియోగిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో డైయింగ్ యూనిట్ ఉండటంతో.. అద్దకంలో వాడిన రసాయన జలాలు మురుగు కాలువల ద్వారా సమీపంలోని ఊరకుంటకు చేరి తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్నాయి. గతంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నదీ జలాల కాలుష్యానికి కారణమవుతున్నాయంటూ పలు డైయింగ్ యూనిట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కాలుష్య కారక రసాయన జలాలను సహజసిద్ధంగా శుద్ధి చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆర్థిక సాయంతో హైదరాబాద్‌లోని ఐఐసీటీ దేశంలోనే ప్రప్రథమంగా సిరిపురంలో ఈ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. సుమారు రూ.2 కోట్లకు పైగా నిధులతో దీనిని నిర్మించారు. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట అండర్‌గ్రౌండ్ డ్రైన్‌ను నిర్మించి ఇళ్ల నుంచి వచ్చే రసాయన, మురుగు నీరు నేరుగా ప్లాంట్‌కు చేరేలా డిజైన్ చేశారు.
రసాయన నీటి శుద్ధి ఇలా..
ప్లాంట్‌కు చేరిన మురుగునీటిలోని వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారాన్ని మొదటి దశలో వేరుచేసి నీటిని సంపులోకి పంపుతారు. ఆ తర్వాత బ్యాక్టీరియా సహకారంతో పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో కాలుష్య కారకాలను, రసాయనాలను వివిధ దశల్లో శుద్ధి చేస్తారు. ఆఖరి దశలో నీటి నాణ్యతను పరీక్షించి, ప్రమాణాల మేరకు శుద్ధి అయితేనే బయటకు వదులుతారు. నాణ్యత లోపిస్తే మళ్లీ రీ–ట్రీట్ చేస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటిని వ్యవసాయం, చెట్ల పెంపకం, గృహ నిర్మాణాలకు వినియోగించుకునేలా పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.
సిరిపురం చేనేతకు
దక్కనున్న ‘ఎకో లేబుల్’
దేశంలో రసాయన జలాల శుద్ధి కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ఇది విజయవంతం కావడంతో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేసినా వాటికి ‘సిరిపురం మోడల్ ట్రీట్‌మెంట్ ప్లాంట్’ గానే నామకరణం చేస్తామని ఐఐసీటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కాలుష్యరహిత విధానాలను పాటించడం వల్ల సిరిపురం గ్రామానికి ప్రభుత్వం ‘ఎకో లేబుల్’ ఇచ్చే అవకాశం ఉందని, తద్వారా ఇక్కడి చేనేత ఉత్పత్తుల ఎగుమతులకు అంతర్జాతీయంగా మరింత డిమాండ్ పెరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ట్రయల్ రన్ విజయవంతం
నేడు గ్రామ పంచాయతీకి అప్పగింత
గతంలో నేను సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఈ ట్రీట్‌మెంట్ ప్లాంట్ మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్లాంట్ నిర్మాణానికి శాస్త్రవేత్తలు, కాంట్రాక్టర్ ఎంతో శ్రమించారు. అందరి కృషితో నిర్మాణం పూర్తయి, ట్రయల్ రన్ విజయవంతమైంది. సిరిపురం గ్రామంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఐఐసీటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– అప్పం లక్ష్మీనర్సు, సిరిపురం మాజీ సర్పంచ్


