మర్రిగూడ(చింతపల్లి) : ఆటోను కారు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జింకల లింగస్వామి తన ఆటోలో గ్రామానికి చెందిన పలువురు మహిళలను ఎక్కించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం వావిల్‌కోల్ గ్రామానికి బయల్దేరాడు. మధ్యాహ్నం వీరు నల్లగొండ జిల్లా చింతపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే ప్రయాణికులకు దాహం వేయడంతో లింగస్వామి ఆటోను రహదారి పక్కన నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళలతో పాటు ఆటో పక్కనే నిలబడిన వారు రోడ్డుపై పడిపోయారు. కొల్కులపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి ఇంద్రమ్మ, పడాల లక్ష్మమ్మ, పడాల మైసమ్మ, పడాల జంగమ్మ, పాలె నర్సమ్మ, పడాల వసంత, పడాల కాశమ్మ, పడాల యాదమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కృష్ణయ్యపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్ లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
● ఎనిమిది మంది మహిళలకు గాయాలు


