ఉమ్మడి పశ్చిమలో 2 జెడ్పీలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి పశ్చిమలో 2 జెడ్పీలు

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

పునర్విభజన ఇలా..

ఏలూరులో జెడ్పీటీసీ స్థానాలు

‘పశ్చిమ’లో జెడ్పీటీసీ స్థానాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా పరిషత్‌ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌ స్థానం ప్రతిపాదికగా తీసుకుని జిల్లాలను ఏర్పాటుచేశారు. దానికనుగుణంగానే జిల్లా పరిషత్‌ను కూడా పూర్తిస్థాయిలో నూతన జిల్లాకు అనుగుణంగా ఏర్పాటుచేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌గా మారనుంది. జెడ్పీటీసీ స్థానాలు, సిబ్బంది మార్పు లు, జిల్లాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మరోవైపు ఈనెల 24తో పాలకవర్గం పదవీ కాలం ముగియనుండటంతో జెడ్పీ విభజన ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నారు.

90 ఏళ్ల చరిత్ర

సుదీర్ఘ చరిత్ర కలిగిన పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌ తొలుత 1936లో జిల్లా బోర్డుగా ప్రస్తానం ప్రారంభించింది. 90 ఏళ్ల సుదీర్ఘ జిల్లా పరిషత్‌ చరిత్రలో పలువురు ప్రముఖులు జెడ్పీ చైర్మన్లుగా రాజకీయంగా కీలక ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులుగా వెలుగొందారు. 1936లో ఏర్పడిన జిల్లా బోర్డుకు మొదటి అధ్యక్షుడిగా రెండేళ్లపాటు సర్ధార్‌ దండు నారాయణరాజు పనిచేశారు. ఆ తరువాత 1959 నుంచి జిల్లా పరిషత్‌గా రూపాంతరం చెందింది. అల్లూరి బాపినీడు మూడుసార్లు జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా గతంలో పనిచేసిన గోకరాజు రంగరాజు టీటీడీ చైర్మన్‌గా చేగొండి హరిరామజోగయ్య, యర్రా నారాయణ స్వామి, మాగంటి రవీంద్రనాథ్‌చౌదరి, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం 22వ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఘంటా పద్మశ్రీ 2023 జూన్‌ 8న బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 24న ఆమె పదవీ కాలం ముగియనుంది. అలాగే జెడ్పీ చైర్మన్లుగా పనిచేసిన వారిలో ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు సైతం ఉన్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాల్లో 48 జెడ్పీటీసీ స్థానాలతో జిల్లా పరిషత్‌ ప్రస్తుతం కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంట్‌ స్థానం ప్రతిపాదికన తీసుకుని ప్రజామోదంతో నూతన జిల్లాలను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలుగా మారింది. అప్పటివరకు జిల్లాలో ఉన్న కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో చేరగా కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు, కై కలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి. ఇక తాజాగా నూజివీడు, కై కలూరు నియోజకవర్గాల్లో 8 మంది జెడ్పీటీసీలతో కలిపి ఏలూరు జిల్లా 27 జెడ్పీ స్థానాలతో కొత్త ఏర్పాటైంది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పశ్చిమగోదావరిలోకి మారిన గణపవ రం జెడ్పీటీసీ స్థానంతో కలుపుకుని పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ 20 స్థానాలతో ఏర్పాటైంది. జిల్లా పరిషత్‌లో ఉపాధ్యాయులు కాకుండా కార్యాలయ సిబ్బంది 976 మంది పనిచేస్తున్నారు. మరో రెండు రోజుల్లో సిబ్బంది విభజనకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి. అలాగే కొత్త జిల్లాలకు ఒక సీఈఓ, డిప్యూటీ సీఈఓ స్థానాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయనుంది.

ఆగిరిపల్లి, భీమడోలు, బుట్టాయగూడెం, చాట్రాయి, చింతలపూడి, దెందులూరు, ద్వారకాతిరుమల, ఏలూరు, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కై కలూరు, కలిదిండి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, లింగపాలెం, మండవల్లి, ముదినేపల్లి, ముసునూరు, నిడమర్రు, నూజివీడు, పెదపాడు, పెదవేగి, పోలవరం, టి.నర్సాపురం, ఉంగుటూరు, వేలేరుపాడు మండలాల జెడ్పీటీసీ స్థానాలతో ఏలూరు జిల్లాపరిషత్‌ను ఏర్పాటుచేశారు.

ఆచంట, ఆకివీడు, అత్తిలి, భీమవరం, యలమంచిలి, గణపవరం, ఇరగవరం, కాళ్ల, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, పాలకోడేరు, పెంటపాడు, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, వీరవాసరం మండలాల జెడ్పీటీసీలతో పశ్చిమ జిల్లాపరిషత్‌ ఏర్పాటైంది.

జిల్లా పరిషత్‌ పునర్వ్యవస్థీకరణ

27 జెడ్పీటీసీ స్థానాలతోఏలూరు జిల్లా పరిషత్‌

20 జెడ్పీటీసీ స్థానాలతోపశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌

సిబ్బంది విభజనకు రెండు రోజుల్లో జీఓలు

ఏలూరులోకి కొత్తగా కై కలూరు, నూజివీడు నియోజకవర్గ జెడ్పీటీసీ స్థానాలు

ఉమ్మడి పశ్చిమ నుంచి నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గ జెడ్పీటీసీ స్థానాలు ‘తూర్పు’నకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement