భీమవరం: విద్యతో విజ్ఞానాన్ని, విలువలతో వ్యక్తిత్వాన్ని అందించి దేశానికి, సమాజానికి భావిపౌరులను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమేగాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యత, దేశభక్తి, సామాజిక స్పృహ వంటి లక్షణాలను పెంపొందించాలన్నారు. ముందుగా మంత్రి శ్రీనివాసవర్మ, కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రా మాంజనేయులు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ కమిషన్ చైర్మన్ పీతల సుజాత జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 65 మంది ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.


