చట్టం అమలైతే నష్టాలెన్నో..
కొల్లేరు లెక్కలు ఇలా..
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రామ్‌సర్ కొల్లేరును చిత్తడి నేలలుగా గుర్తించింది. కొల్లేరు జీవవైవిధ్యం ఎంతో గొప్పది. చిత్తడి నేలల ప్రాంతం నీటితో సంబంధం ఉండదు. సముద్రంలో హెపీఎల్ మాదిరిగా చిత్తడి నేలల ఎఫెక్ట్‌ను 10వ కాంటూరు వరకు నిర్ణయించారు. చిత్తడి నేలల చట్టం చెరువులకు వ్యతిరేకం కాదు. కొల్లేరుపై సుప్రీంకోర్టు తీర్పులను ప్రభుత్వం అమలుచేయాలి.
–డాక్టర్ తల్లావజ్జుల పతాంజలిశాస్త్రి, పర్యావరణవేత్త, రాజమహేంద్రవరం
చిత్తడి నేలల చట్టం అమలు ప్రజల జీవన పరిస్థితులను దెబ్బతీస్తుంది. డెల్టా ప్రాంతంలో పరిశ్రమలు, ఐస్ ఫ్యాక్టరీలు మూతబడతాయి. ఆక్వారంగం, వ్యవసాయ రంగం ఇబ్బంది పడతాయి. చిత్తడి నేలల పరిధి అమలు కాకుండా అందరం కలసికట్టుగా ప్రజల వాదనను సుప్రీంకోర్టుకు వివరిద్దాం. అధికారులు ప్రజల జీవనకోణంలో ఆలోచించాలి.
– ముదునూరి సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్ చేపల రైతుల సంఘ మాజీ అధ్యక్షుడు, భుజబలపట్నం
కైకలూరు : ఆసియాలో అతిపెద్ద మంచినీటి సర స్సు, అంతర్జాతీయ రామ్‌సర్ సైట్ అయిన కొల్లేరు నేడు మరోసారి వార్తల్లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ చిత్తడి నేలల పరిరక్షణ చట్ట నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, సరిహద్దులను గుర్తించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు, లక్షలాది మంది జీవనోపాధికి మధ్య ఇది పెద్ద సవాలుగా మారింది.
6 నియోజకవర్గాలు.. 9 మండలాలు
కృష్ణా, గోదావరి నదుల మధ్య సహజసిద్ధంగా ఏ ర్పడిన కొల్లేరు సరస్సు 10వ కాంటూరు (సముద్ర మట్టానికి సమానమైన ఎత్తు) వరకు 2.25 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. అక్రమ చెరువుల వ్యాప్తిపై పర్యావరణవేత్తల ఫిర్యాదుల నేపథ్యంలో, 1999 అక్టోబరు 4న 5వ కాంటూరు వరకు ఉన్న 77,138 ఎకరాలను అభయారణ్యంగా గుర్తిస్తూ జీఓ 120 తెచ్చారు. చిత్తడి నేలల పరిధిలోని ఈ ప్రాంతం ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జి ల్లాల్లోని 6 నియోజకవర్గాలు, 9 మండలాలు, 2 పా ర్లమెంటు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 22 లక్షల మంది జ నాభా నివసిస్తున్నారు.
న్యాయస్థానాల ఆదేశాలు.. రామ్‌సర్ గుర్తింపు
2002 ఆగస్టు 19న అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన చిత్తడి నేలగా కొల్లేరు రామ్‌సర్ కన్వెన్షన్ పరిధిలోకి చేరింది. దేశంలోని అన్ని చిత్తడి నేలలకు వర్తించేలా జస్టిస్ అరవింద్‌కుమార్, జస్టిస్ విపుల్ ఎం.సంచోలిల ధర్మాసనం రెండు నెలల్లోగా చిత్తడి నేలల హద్దులు గుర్తించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతకుముందు సుప్రీంకోర్టు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) కొల్లేరులో 6,900 హెక్టార్లలో అక్రమ చేపల చెరువుల గట్లు ధ్వంసం చేయడం, విద్యుత్ కనెక్షన్లు తొలగించడం, ఆటపాక పక్షుల కేంద్రానికి నీటిని సరఫరా చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాయి.
స్థానికుల వాదనలు.. ఆర్థిక ప్రభావం
కేంద్రం ప్రకటించిన 10వ కాంటూరు పరిధిలోని 2.25 లక్షల ఎకరాల్లో, 1.61 లక్షల ఎకరాలు చిత్తడి నేలల పరిధిలోకి రావని వాయిస్ ఆఫ్ కొల్లేరు సంస్థ సభ్యులు వాదిస్తున్నారు. ఈ చట్టం అమలైతే ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో లక్షలాది మందికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వారంగం దెబ్బతింటే ప్రభుత్వానికి ఏటా రూ.40 వేల కోట్ల నష్టం వస్తుందని అంటున్నారు. పక్షులు, నీటి వనరుల సంరక్షణతో పాటు స్థానికుల జీవనోపాధిని, మానవ హక్కులను కూడా ప్రభుత్వాలు గౌరవించాలని కొల్లేరు ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం
జిరాయితీ భూములు ఆక్వా చెరువులుగా మార్చలేరు.
బఫర్‌జోన్‌లో కొత్త శాశ్వత భవనాలు, లేఆవుట్, రియల్ ఎస్టేట్ నిషేధం.
ఏలూరు అర్బన్ శివారులు, కై కలూరు, ఆకివీడులో పట్టణ విస్తరణలకు ఆటంకం.
మరుగునీరు, వ్యర్థాలను శుద్ధి చేయకుండా విడుదల చేయడం నిషేధం.
రెడ్, ఆరెంజ్ పరిశ్రమలు, రసాయన ఆధారిత యూనిట్లు, ఆక్వా ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు సాధ్యపడదు.
నిబంధనలు పాటించని కర్మాగారాలకు మూసివేత నోటీసులు ఇస్తారు.
చిత్తడి నేల రికార్డులో భూమి నమోదైతే మార్కెట్ ధర పడిపోవడం, బ్యాంక్ రుణాలు తగ్గడం, కొనుగోలుదారులు ముందుకు రారు.
విద్యుత్ తీగల ఏర్పాటు, రోడ్ల విస్తరణ, హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటు, రాత్రిసమయల్లో వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉంటుంది.
చివరకు విమానం, హాట్–ఎయిర్ బెలూన్‌లకు సైతం నిషేధం వర్తిస్తోంది.
రెండు నెలల్లో సరిహద్దుల నిర్ధారణకు సుప్రీంకోర్టు ఆదేశం
కొల్లేరు 10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాలకు వర్తింపు
ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో 13 మండలాలపై ప్రభావం
ప్రకృతి పరిరక్షణా? ప్రజా జీవనోపాధా? కలవరపాటు
వాయిస్ ఆఫ్ కొల్లేరు పేరుతో కొల్లేరు గ్రామాల్లో అవగాహన
10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాలు
5వ కాంటూరు వరకు 77,138 ఎకరాలు
చిత్తడి నేల కాదంటున్న భూమి 1.61 లక్షల ఎకరాలు
పట్టా భూములు 14,932 ఎకరాలు
డీ ఫాం భూములు 5,510 ఎకరాలు
5వ కాంటూరులో గ్రామాలు 122 (9 మండలాలు)
10వ కాంటూరు వరకు జనాభా 22 లక్షలు
కొల్లేరు ఆపరేషన్ (2006)లో
ధ్వంసం చేసిన చెరువులు 43,000 ఎకరాలు


