భీమవరం: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద శనివారం గురువుకు గౌరవం డీఎస్సీ అభ్యర్థికి న్యాయం చేయాలంటూ నిర్వహించిన గురువు పరిరక్షణ దీక్షా కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. వీరిలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం స్టేట్ సెక్రటరీ మానుకొండ ప్రదీప్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ తదితరులు ఉన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): కాకినాడ, రాజమ హేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవా డ ప్రభుత్వ ఐటీఐల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇండియా ఏఐ డేటా, ఏఐ ల్యాబ్స్ కోసం కాంట్రాక్టు పద్ధతిన పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ ఉప సంచాలకుడు (కాకినాడ) బి.మురళీధర్ ప్రకటనలో తెలిపారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్–5, డేటా క్యురేటర్ అసిస్టెంట్–5, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్–10 పోస్టులు ఉన్నాయన్నారు. అర్హులు తమ దరఖాస్తులను ఈనెల 25న సాయంత్రం 5 గంటలలోపు కాకినాడలోని ప్రాంతీయ ఉపసంచాలకులు కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
పెనుమంట్ర: చీడపీడలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకుడు (ఏడీఆర్) డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ అన్నారు. శనివారం పరిశోధనా స్థానంలో శిక్షణ, సందర్శన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించగా జిల్లా వ్యవసాయ అధికారి ఎంవీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సార్వా వరి పంట పిలకలు కట్టే దశ నుంచి చిరుపొట్ట దశలో ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల అక్కడక్కడా జింక్ లోపం, ఆకు నల్లి, బాక్టీరియా ఆకు ఎండు తెగుళ్లు ఆశిస్తున్నట్టు గుర్తించామన్నారు. రైతులను అప్రమత్తం చేయాల్సిన బా ధ్యత రైతులపై ఉందన్నారు. పరిశోధనా స్థా నంలో ఆరు రకాల నూతన కలుపు మందుల పరిశీలన జరుగుతోందని తెలిపారు. వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గిరిజారాణి మాట్లాడుతూ ఎంటీయూ 1318 రకం పంట కాలం పెరగకుండా ఉండేందుకు నత్రజని ఎరువును రెండు దఫాలుగా వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. మానుపండు తెగులు నివారణకు చిరుపొట్ట, పూత దశల్లో ప్రోపికోనజోల్ పిచికారీ చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 99.43 శాతం విస్తీర్ణంలో వరి సాగైందన్నారు. ప్రధాన శాస్త్రవేత్త ఎంవీ కృష్ణాజీ, వివిధ డివిజన్ల సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని అనాకోడేరు, కొమరాడ, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప, గొల్లవానితిప్ప, గూట్లపాడు, దొంగపిండి, లోసరి, తుందుర్రు, బేతపూడి, వెంప, రాయలం, చినఅమిరం తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటల పాటు జనజీవనం స్తంభించింది. పల్లపు గ్రామాలైన నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప, గూట్లపాడు, తోకతిప్ప, రామాయణపురం తదితర గ్రామాల్లోని శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షం చేపల రైతులు మేలు చేస్తుందని అంటున్నారు.
నరసాపురం: పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు బుడితి సుమన్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్‌ను నాలుగు రోజులుగా బ్లాక్ చేశారు. ఇతర దేశాల్లో మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్స్ కనిపిస్తున్నాయని, మన దేశంలో మాత్రం కనిపించడం లేదని ఆయన చెప్పారు. సుమన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ప్రభుత్వ పా లనలో జరుగుతున్న లోపాలు, ప్రజలకు ఇతర విధాలుగా జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన అంశాలను తన అకౌంట్స్ వేదికగా పంచుకుంటూ ఉంటారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అవకతవకపై పలు పోస్టులు పెట్టారు. ఈ కారణంగానే తన ఖాతాలను బ్లాక్ చేశారని, ఇది స్వేచ్ఛను హరించడమే అని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.


