ద్వారకాతిరుమల: జయ కృష్టా.. ముకుంద.. మురారి.. కీర్తనలతో శ్రీవారి దివ్యక్షేత్రం మార్మోగింది. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శనివారం సా యంత్రం ఉట్ల పండుగ, స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగాయి. ఉట్ల ఉత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంపై కొలువుదీర్చారు. వాహనాన్ని సుందరంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య వాహనం ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. శ్రీవారి కల్యాణ మండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టిన యువకుడిని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు సత్కరించారు. కొండపైన గోసంరక్షణశాల వద్ద, క్షేత్రంలోని పలు కూడళ్లలో ఉట్ల సందడి కనిపించింది. గోసంరక్షణశాల వద్ద ఘాట్‌రోడ్డులో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, అలంకరణలు ఆకట్టుకున్నాయి.
ద్వారకాతిరుమలలో ఉట్ల ఉత్సవం
గోసంరక్షణశాల వద్ద ఉట్టిని కొడుతున్న యువకులు
ఘాట్ రోడ్డులో చిన్నారుల నృత్యప్రదర్శన


