భీమవరం: క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో భీమవరంలో నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల బ్రోచర్‌ను మునిసిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈనెల 27న క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని, 28న సెయింట్ మేరీస్ విద్యార్థులతో 400 అడుగుల జాతీయ జెండాతో క్రీడా ర్యాలీ, 29న క్రీడా దినోత్సవ వేడుకలు, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎ రాంబాబు, హాకీ కోచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ తల్లికి గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన కొప్పర్తి బేబీ శ్రీ ఫణి అనీషా రూ.2,20,000 విలువైన వెండి వస్తువులను కానుకగా సమర్పించారు. 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె, ఉద్ధరిణిని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలను శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, మిర్తిపాటి గున్నేశ్వరరావు, పాపొలు ఏడుకొండలు అమ్మవారి ప్రసాదాన్ని, జ్ఞాపికను అందజేశారు.
దెందులూరు: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పెదవేగి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామ శివారు చింతలపాటివారిగూడెంలో తన భర్త ఇంటి వద్ద ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడని అతడి భార్య లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని చాట్ల తంబి (45)గా గుర్తించారు. తంబి తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. మద్యం అలవాటు, అనారోగ్యం కారణంగా దయ్యాలు కనిపిస్తున్నాయని ఆందోళన గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.


