పురపోరుకు న్యాయ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

పురపోరుకు న్యాయ పరీక్ష

Aug 26 2026 1:36 AM | Updated on Aug 26 2026 1:36 AM

పురపోరుకు న్యాయ పరీక్ష ● పట్టణాల్లో విలీనానికి ససేమిరా అంటున్న గ్రామాలు ● విలీన కేసుల ‘ముడి’ వీడేనా? ● కూటమి నేతల ప్రయత్నాలు విఫలం

ఫలించని కూటమి నేతల భేటీలు

సాక్షి, భీమవరం : రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి ఎన్నికల సంఘం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. పట్టణాల్లో ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. అంతటా ఎన్నికల వేడి మొదలైనప్పటికీ, జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో మాత్రం విలీన వివాదాలు భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. గ్రామ విలీన కేసుల ఉపసంహరణకు స్థానిక నేతలు ససేమిరా అనడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది.

ఏడేళ్లుగా ప్రత్యేక పాలనే

జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం మున్సిపాల్టీలతో పాటు ఆకివీడు నగర పంచాయతీ ఉంది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భీమవరంలో తాడేరు, రాయలం, చినఅమిరం, నరసింహపురం, కొవ్వాడ అన్నవరం, తణుకులో వెంకటరాయపురం, పైడిపర్రు, వీరభద్రపురం, పాలకొల్లులో దిగమర్రు, వరిధనం, కొంతేరు, భగ్గేశ్వరం, పూలపల్లి, యాళ్లవానిగరువు, ఉల్లంపర్రు, అడివిపాలెం, తాడేపల్లిగూడెంలో: పడాల, కుంచనపల్లి, ఎల్‌.అగ్రహారం, కుండ్రుప్రోలు, ప్రత్తిపాడు గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. అయితే పురపాలక సంఘాల్లో విలీనం వల్ల పన్ను భారం పెరుగుతుందని, ఇళ్ల నిర్మాణాలు, లేఅవుట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఉపాధి హామీ పథకం వర్తించదని పలు గ్రామాల నాయకులు కోర్టులను ఆశ్రయించారు. విలీనంతో మౌలిక వసతులు కల్పన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం తదితర ప్రయోజనాలను వివరించడం ద్వారా నాటి వైఎస్సార్‌ సీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలతో అప్పట్లోనే ఆయా గ్రామాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ నేతలు కేసులను దాదాపు ఉపసంహరించుకున్నారు. టీడీపీ, మిగిలిన రాజకీయ పార్టీలు అంగీకరించకపోవడంతో కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీంతో ప్రతిబంధకాలు లేని నరసాపురం, ఆకివీడులో 2021 మార్చిలోనే ఎన్నికలు జరగ్గా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాల్టీలు గత ఐదేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. అంతకుముందు రెండేళ్ల ప్రత్యేక పాలనతో కలిపితే మొత్తం ఏడేళ్లుగా ఈ నాలుగు పట్టణాల్లో అధికారుల పాలనే సాగుతోంది.

ఆశావహుల్లో నిరాశ.. ప్రజల్లో నిరీక్షణ

నరసాపురం, ఆకివీడులతో పాటు గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల రిజర్వేషన్లు, విజయావకాశాలపై ఆశావహులు లెక్కలు వేసుకుంటుంటే ఈ నాలుగు మున్సిపాల్టీల్లో మాత్రం ఎన్నికలు జరుగుతాయో లేదోనని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. వార్డుల విభజన నోటిఫికేషన్‌ రాకపోవడం వారిపై నీళ్లు చల్లినట్లయ్యింది. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం, తాగునీరు, పారిశుద్ధ్యం, పౌరసేవల వ్యవస్థ గాడిన పడాలన్నా, అధికారుల్లో జవాబుదారీతనం పెరగాలన్నా త్వరగా ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఈసారి విలీన వాజ్యాలను పక్కనపెట్టి అన్ని పట్టణాల్లోనూ వార్డుల పునర్విభజన చేపట్టి ఎన్నికలు జరుపుతారనే ప్రచారం జరిగినప్పటికీ ఇటీవల కేవలం నరసాపురం, ఆకివీడులలో మాత్రమే వార్డుల విభజనకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో మిగిలిన చోట్ల ఆందోళన మొదలైంది. స్వపక్షాల నేతలతో కోర్టు కేసులు విత్‌డ్రా చేయించాలన్న ఆలోచనలో కూటమి నేతలు ఉన్నారు. భీమవరం మున్సిపాల్టీలో ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు తాజాగా భేటీ అయ్యారు. విలీన ప్రతిపాదిత గ్రామాలకు చెందిన కూటమి పక్షాల నేతలతో సమావేశమై కేసులు ఉపసంహరణపై చర్చించారు. కోర్టులో తేలేవరకు విలీనానికి అంగీకరించబోమని వారు స్పష్టం చేయడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోనూ కేసుల ఉపసంహరణకు కూటమి నేతల ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. స్వపక్ష మంత్రి, ఎమ్మెల్యే స్థాయి నేతల ఒత్తిళ్లను ఆ పార్టీలకు చెందిన లోకల్‌ లీడర్స్‌ పట్టించుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement