మెషీన్లు ఎక్కడ ?
సాక్షి, భీమవరం : కుట్టుశిక్షణ పేరిట కూటమి ప్రభుత్వం కనికట్టు చేసింది. పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ ఆశలు రేపి శిక్షణ పూర్తయ్యాక కుట్టుమెషీన్లు పంపిణీ ఊసుమరిచింది. సర్కారు మాటలు నమ్మి వ్యయప్రయాసలకోర్చి శిక్షణ పొందిన మహిళలు కుట్టుమెషీన్లు కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరగా అందించమని కోరుతూ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు.
గతేడాది శిక్షణ
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పన పేరిట కూటమి ప్రభుత్వం గతేడాది ఉచిత కుట్టుశిక్షణ కార్యక్రమం నిర్వహించింది. శిక్షణ అనంతరం మహిళలకు కుట్టుమెషీన్లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 3,486, ఏలూరు నుంచి 3.259 మంది కలిపి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,745 మందిని కుట్టుశిక్షణ కోసం ఎంపిక చేశారు. వీరిలో బీసీ మహిళలు 4,516 మంది ఉండగా, బ్రాహ్మణ 28 మంది, కమ్మ 211, కాపు 1711, రెడ్డి 86, ఆర్యవైశ్య 87, క్షత్రియ 50, ఈబీసీ 56 మంది ఉన్నారు.
రూ.కోట్లు కుమ్మరించి
శిక్షణ నిమిత్తం చంద్రబాబు సర్కారు కోట్లాది రూపాయలు కుమ్మరించింది. శిక్షణ నుంచి మెషీన్లు పంపిణీ వరకు మొత్తం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మూడు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. బయట శిక్షణ నిమిత్తం రూ.7 వేల నుంచి రూ.10 వేలలోపు ఫీజు ఉంటే ఏజెన్సీలకు భారీ మొత్తంలో కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. శిక్షణ పొందేవారు ఒక్కొక్కరికి రూ.15,599 చొప్పున రూ.10.52 కోట్లు, కుట్టుమెషీన్‌కు రూ.6,199లు చొప్పున రూ.4.18 కోట్లు లెక్కలు కట్టారు. మొత్తంగా ఒక్కో మహిళకు రూ.21,798లు చొప్పున రూ.14.7 కోట్ల వ్యయంతో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రానికి 144 మంది చొప్పున భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 వరకు కేంద్రాలను ఏర్పాటుచేశారు. గత మే నెల నుంచి సెప్టెంబరు వరకు పలు విడతలుగా శిక్షణ కార్యక్రమం సాగింది. రోజుకు రెండు బ్యాచ్‌లుగా మహిళలకు సంబంధించిన జాకెట్లు, చిన్నపిల్లల గౌన్స్, జుబ్బాలు తదితర వాటిలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అందుకు అవసరమైన దారాలు, క్లాత్, ఇతర మెటీరియల్ బాద్యత మహిళలదే. నిర్వాహకులు కేవలం శిక్షణ మాత్రమే ఇచ్చారు.
శిక్షణ పొందిన మహిళలకు ప్రభుత్వం కుట్టుమెషీన్లు అందజేయాల్సి ఉంది. ఏడాదవుతున్నా కుట్టుమెషీన్లు ఇంకా అందజేయకపోవడం గమనార్హం. వ్యయ ప్రయాసలకోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ పొందిన మహిళలు ఇళ్ల వద్ద ఖాళీగా ఎదురు చూడాల్సి వస్తోంది. ఎన్నో కష్టాల నష్టాలకోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ తీసుకున్నామని, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కుట్టుమెషీన్లు అందజేయలేదని మహిళలు చెబుతున్నారు. కుట్టుమెషీన్లు ఎప్పుడు వస్తాయంటూ కొందరు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరితగతిన మెషీన్లు అందజేయాలని మరికొందరు కలెక్టరేట్ల వద్ద జరిగే పీజీఆర్‌ఎస్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వలనే మెషీన్లు ఇంకా అందజేయలేదని తెలుస్తోంది. కాగా ఏజెన్సీల నుంచి కుట్టుమెషీన్లు వచ్చాక మెషీన్లు అందజేస్తామని అధికారులు అంటున్నారు.
స్వయం ఉపాధి పేరిట మహిళలకు కుట్టు శిక్షణ
కుట్టుమెషీన్లు అందజేస్తామన్న ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 6,745 మందికి శిక్షణ
శిక్షణ నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15,599 చొప్పున రూ.10.52 కోట్లు
కుట్టుమెషీన్లకు రూ.4.18 కోట్లు
ఏడాదవుతున్నా జాడలేని మెషీన్లు


