కోదాడలో బస్సు ప్రమాదం.. ఏలూరులో కలకలం | - | Sakshi
Sakshi News home page

కోదాడలో బస్సు ప్రమాదం.. ఏలూరులో కలకలం

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

కోదాడలో బస్సు ప్రమాదం.. ఏలూరులో కలకలం

కోదాడ రూరల్‌/ఏలూరు టౌన్‌: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో బుధవారం వేకువజామున హైదరాబాద్‌ నుంచి ఏలూరు వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఆగిఉన్న ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌డ్రైవర్‌ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురి మృతదేహాలను, గాయపడిన వారిని స్థానికులు సహాయంతో ఉదయం ఐదున్నర గంటల వరకు కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలని డాక్టర్లు సూచించగా.. వారు సూర్యాపేట, ఖమ్మం, విజయవాడకు వెళ్లారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరుగా కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. ఆరుగురి మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో కోదాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. మృతుల్లో ఐదుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉండగా.. ‘ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివించి, ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్న సమయంలో మాకు ఈ శిక్ష విధించావు ఎందుకు దేవుడా..’ అని వారి కుటుంబ సభ్యులు రోదించడం చూసి ఆస్పత్రికి వచ్చిన వారు సైతం కన్నీరు పెట్టారు.

ఉమ్మడి ‘పశ్చిమ’లో..

ట్రావెల్స్‌ బస్సు జర్నీ డేటాను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఏలూరుకు 22 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది. వీరిలో ఏలూరులోని ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌, జ్యూట్‌ మిల్లు, ఆశ్రం ఆస్పత్రి, పాత బస్టాండ్‌ గమ్యస్థానాలుగా ఉన్న వారు ఉన్నారు. దీంతో ఏలూరు నగరవాసుల్లో కలకలం రేగింది. తమకు చెందిన బంధువులు ఉన్నారా అని ఆరా తీశారు. ఇదిలా ఉండగా.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పెద్దోజు భవానీ అనే మహిళకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement