సిబ్బంది ఉన్నా.. బయటి వ్యక్తులపై ఆధారపడే పరిస్థితి
త్వరలో నూతన కార్యాలయ నిర్మాణం
పాలకొల్లు సెంట్రల్ : పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి (పంచారామం) ఆలయ నిర్వహణలో అధికారులు, పాలకమండలి సభ్యుల తీరు వివాదాస్పదంగా మారింది. పలు నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, ఆలయ నిధుల దుర్వినియోగానికి దారితీస్తున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా గేటు పంచాయితీ
ఆలయానికి తూర్పు ఆగ్నేయంలో ఉన్న గేటును ఇటీవల అధికారులు మూసివేశారు. దీంతో అక్కడే వేలంపాట ద్వారా పూజా సామగ్రి దుకాణం దక్కించుకున్న వ్యాపారి జీవనోపాధి దెబ్బతింది. ఆయన తన సామాజికవర్గ పెద్దలు, టీడీపీ నేతలను ఆశ్రయించి ధర్నాకు దిగుతామని హెచ్చరించడంతో.. వెనక్కి తగ్గిన ట్రస్ట్‌బోర్డు సభ్యులు, అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ఆ గేటును తెరిపించారు.
నిధుల దుర్వినియోగం.. దేవుడి సొమ్ము వృథా
ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల స్వామివారి నిధులు వృథా అవుతున్నాయి. ప్రస్తుతం గోశాల ఉన్న స్థలంలో (పాత ఎస్‌పీఆర్‌ఆర్ క్లబ్) సుమారు రూ.కోటితో నూతన కార్యాలయం నిర్మించడానికి అనుమతులు వచ్చాయి. కొత్త భవనం నిర్మిస్తారని తెలిసీ, పాత భవనానికి అధికారులు సుమారు రూ.2 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయడం నిధుల దుర్వినియోగమే.
కొబ్బరికాయల దిమ్మలు: భక్తుల సౌకర్యార్థం ఆలయంలో కాంక్రీట్ దిమ్మలను పగలగొట్టించి, సుమారు రూ.1.50 లక్షలతో ఐరన్ డోమ్‌లను ఏర్పాటుచేశారు. కొబ్బరికాయలు కొట్టినప్పుడు వచ్చే భారీ శబ్ధాలకు భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, వాటిని తొలగించి మళ్లీ పాత పద్ధతిలోనే కాంక్రీట్ దిమ్మలు కట్టించారు. జరిగిన వృథాను ప్రశ్నిస్తే భక్తులకు దైవభక్తి లేదంటూ అధికారులు ఎదురుదాడికి దిగుతున్నారు.
ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతోందా?
గతంలో ధ్వజస్తంభం వద్ద షెడ్డు నిర్మించడానికి అధికారులు ప్రయత్నించగా, పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా వచ్చి పనులను నిలిపివేశారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. అయినా అధికారులు ఆయన మాట బేఖాతరు చేస్తూ పోల్స్ పాతగా, మళ్లీ పత్రికల్లో వార్తలు రావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయగా వాటిని తొలగించారు. ముందుగా చెబితే మంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తారన్న ఉద్దేశంతోనే ప్రస్తుత నిర్మాణ పనులను ఆయనకు తెలియకుండానే హడావుడిగా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆలయంలో ఈఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్.. ఇలా ఇంతమంది సిబ్బంది ఉన్నా ప్రయోజనం శూన్యం. ఆన్‌లైన్ రికార్డులు రాయడానికి మాత్రం వేరే ఆలయం నుంచి ఓ వ్యక్తిని రప్పించి అదనంగా డబ్బులు చెల్లించి పని చేయించుకోవడం గమనార్హం.
తూర్పు ఆగ్నేయ భాగంలో ప్రహరీ గోడను తొలగించిన ప్రదేశంలో లాక్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పూజా సామగ్రి విక్రయదారుల కోసం నాలుగు షాపులు ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి పురావస్తు శాఖ అనుమతులు అవసరం లేదు. పడమర దిక్కున ప్రహరీ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కాంట్రాక్టర్ త్వరలో పనులు ప్రారంభిస్తానని చెప్పాడు. అలాగే ఆలయంలో నూతన కార్యాలయ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నాం.
– ముచ్చర్ల శ్రీనివాసరావు, క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం ఈఓ, పాలకొల్లు
వివాదాస్పదంగా ఆలయ నిర్వహణ తీరు
ఇప్పటికీ నోచుకోని పడమరలో ప్రహరీ గోడ నిర్మాణం
తాజాగా తూర్పు ప్రహరీ గోడను తొలగించేందుకు సన్నాహాలు
భక్తుల మనోభావాలు పట్టని వైనం


