భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ)గా పి. గ్లోరియా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి డీఆర్‌ఓగా వ్యవహరించిన పి. ప్రభాకర్ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని గ్లోరియా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
భీమవరం : ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోవడానికి నిరసనగా యుటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి భీమవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక యుటీఎఫ్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేడ్కర్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీవీఎస్ విజయరామరాజు, కార్యదర్శి పి.కాంత్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడలేదని విమర్శించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి టెట్ నిబంధనలను సడలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ నాయకులు జీవీ రామారావు, సీహెచ్. కుమార్ బాబ్జీ, కె.శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్ : గోదావరి వరద మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు శబరి నది నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 29 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వేలోని 48 గేట్ల ద్వారా 3.34 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి ఉధృతి పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఏకపక్షంగా స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం సుధీర్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బీ. రెడ్డిదొర తీవ్రంగా ఆక్షేపించారు. ఉపాధ్యాయ సంఘాలు కోరిన వినతులను పరిగణనలోకి తీసుకోకుండా జీఓ ఇవ్వడం సరికాదని మంగళవారం విడివిడిగా ప్రకటనలు విడుదల చేశారు. ఉపాధ్యాయులకు కొత్తగా ఉద్యోగ నియామకం కాదు కాబట్టి రోస్టర్ విధానంతో పనిలేదని, అందరికీ 40 శాతం ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించాలని కోరారు. 2009 కంటే ముందు వృత్తిలో చేరిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. టెట్ మినహాయింపు కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలవడానికి వెళ్లిన ఉపాధ్యాయ సంఘ నాయకుల సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, బకాయిలు ఉన్న డీఏలు, సీఎల్, ఐఆర్, పీఆర్‌సీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


