వనపర్తి: విద్యార్థులు రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని బండారునగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి విద్యాభ్యాసం, హాజరు, క్రమశిక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, భోజనం తయారు చేసే సమయంలో శుభ్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. వంటశాల, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చదవాలని సూచించారు.


