జిల్లాలోని 11 మిల్లుల అక్రమాల చిట్టా అధికారుల చేతికి..
ఈడీ విచారణ చేపట్టింది.
11 మిల్లులు.. రూ.101.10 కోట్ల విలువ..
కొనసాగుతున్న విజిలెన్స్ సోదాలు..
● మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం
● అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా
● జిల్లాలో వరుసగా విజిలెన్స్ దాడులు
వనపర్తి: జిల్లాలో సీఎంఆర్ అక్రమాల పుట్ట తొవ్వేకొద్దీ ఊటబావిలోని నీటిలా వెలికి వస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా నెలరోజులుగా చేపడుతున్న విజిలెన్స్ దాడులతో రూ.కోట్ల అక్రమాలు వెలుగులోకి రావడం, క్రిమినల్ కేసులు నమోదవుతున్న విషయం విధితమే. కాగా.. కొందరు రైస్‌మిల్లర్లు అవినీతిలో తిమింగలాలతో పోటీపడుతున్నారంటూ వారి విచారణ బాధ్యతలను ఈడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా సీఎంఆర్ కోసం చేసిన ధాన్యం కేటాయింపులను మాయం చేయడం, బియ్యం ఇవ్వకుండా వాయిదాలతో కాలం గడుపుతున్న 11 మిల్లుల యాజమాన్యాలపై ఈడీ తనదైన శైలిలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సదరు అక్రమాల్లో అగ్రగనుల చిట్టా ఈడీ చేతికి అందినట్లు తెలుస్తోంది. గత పది సీజన్లలో మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పెండింగ్ బియ్యం విలువ సుమారు రూ.623.45 కోట్లు. కాగా.. ఇందులో అత్యధికంగా బకాయి ఉన్న 11 మిల్లుల యాజమాన్యాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ.. వీరిపై విచారణ చేసే బాధ్యతను ఈడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని విక్రయించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణాధికారాలు ఈడీ చేతికి వెళ్లినట్లు సమాచారం.
జిల్లాలో 191 రైస్‌మిల్లులు ఉండగా.. 11 మిల్లుల బకాయిలు భారీ ఎత్తున దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నట్లు భావించిన అధికారులు వారు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి స్వప్రయోజనాల కోసం అందుకు సంబంధించిన డబ్బును వినియోగించిట్లు భావించి విచారణ బాధ్యతను ఈడీకి బదలాయించబడినట్లు తెలుస్తోంది. వీరి బ్యాంకు లావాదేవీలు.. వారు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువుల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులు.. నూతనంగా ప్రారంభించిన వ్యాపారాలు తదితర అంశాలపై లోతైన విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.
మనీ లాండరింగ్ కోణంలో..
గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి గ్యారెంటీలు లేకుండా రూ.కోట్ల విలువైన వరి ధాన్యం కేవలం ఒక మిల్లుకు యజమాని అనే కారణంతో రికవరీతో సంబంధం లేకుండా విచ్ఛలవిడిగా కేటాయించడంతో అక్రమాలకు అవకాశం ఇచ్చినట్లయింది. జిల్లాలో అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు మిల్లర్లు ఇదే అదునుగా భావించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బయట మార్కెట్‌కు విక్రయించి ఆస్తులు, కొత్త వ్యాపారాలకు పెట్టుబడి కోసం వినియోగించుకున్నట్లుగా వచ్చిన ఆరోపణల మేరకు 11 మిల్లుల యజమానులపై మనీ లాండరింగ్ కోణంలో విచారణకు ఈడీ సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి సేకరించిన వరి ధాన్యం విక్రయించిన మిల్లుల యజమానుల్లో కొందరు పెద్దమొత్తంలో ఇతర వ్యాపారాల్లోకి, ఆస్తుల్లోకి మళ్లించినట్లుగా అనుమానం వచ్చి రాష్ట్ర అధికారులు ఈడీకి అప్పగించారు.
ఇప్పటికై తే.. ఒకే యజమానికి చెందిన ఐదు రైస్‌మిల్లులపై ఈడీ విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో విచారణకు హాజరై వచ్చా ను. ఇంకా కొన్ని ఉన్నాయన్నారు కాని మాకు విచారణ విషయమై సమాచారం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అత్యధికంగా సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులపై విచారణ చేసేలా పౌరసరఫరా లశాఖ సిఫారస్ చేసింది. – ఆంజనేయులు,
డీఎం, పౌరసరఫరాల కార్పొరేషన్
జిల్లాలో నలుగురికి చెందిన 11 మిల్లులకు ఇప్పటి వరకు కేటాయించిన వరి ధాన్యంలో పెండింగ్ సీఎంఆర్ రూ.101.10 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టనుంది. ఇదే జిల్లాలో ఒక మిల్లరు రూ.వంద కోట్లకుపైగా బకాయి ఉన్నట్లు ఇటీవల ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పించారు. వారి మిల్లుపై ఇటీవల విజిలెన్స్ సోదాలు నిర్వహించినా.. ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.
సీఎంఆర్ అక్రమాలపై కొంతకాలంగా జిల్లాలో వరుసగా విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం పెబ్బేరులోని ఓ మిల్లులో తనిఖీలు చేపట్టారు. కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపూరం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లోని మిల్లుల్లో వరుస తనిఖీలు చేస్తూ ధాన్యం లోటు ఉన్న మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తుండటం.. భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఈడీ విచారణకు సిఫారస్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


