ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా శుద్ధి ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా సమీపంలో ఉన్న 75 ఎంఎల్‌డీ మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్‌ను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మిషన్ భగీరథ సూపరింటెండెంట్‌తో కలిసి ప్లాంట్‌లోని నీటి ప్రవాహం, ఫిల్టరేషన్ ప్రక్రియను పరిశీలించారు. గౌరీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి ప్లాంట్‌కు ఏ విధంగా నీరు చేరుతుంది.. వివిధ దశల్లో శుద్ధిచేసి ప్రజలకు ఏ విధంగా సరఫరా చేస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కూడా నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట మిషన్ భగీరథ ఈఈ అంజద్, ఇంజినీరింగ్ అధికారులు, సర్పంచ్, సిబ్బంది ఉన్నారు.


