వనపర్తి: గణప సముద్రం రిజర్వాయర్‌తో ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతున్నారు.. కాబట్టి భూములు కోల్పోతున్న రైతులకు సైతం ప్రభుత్వం తరఫున సరైన న్యాయం అందించేందుకు బాధ్యత తీసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి బుద్ధారం, ఖిల్లాఘనపురం గణపసముద్రం భూ నిర్వాసితులతో సమావేశమై నష్టపరిహారం చెల్లింపు విషయంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణప సముద్రంలో లక్ష్యం మేర నీటినిల్వ సామర్థ్యం తగ్గించకుండా బండ్ ఎత్తు పెంచితే రైతుల నుంచి సేకరించాల్సిన నికర భూమి తగ్గుతుందని, తద్వారా ఇటు రైతులు అటు ప్రభుత్వానికి లాభం కలుగుతుందని, ఆ దిశగా సర్వే పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను కోరారు. భూ నిర్వాసితులకు నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.11.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉందని.. కానీ సన్న, చిన్నకారు రైతులు నష్టపోతున్నందున కాస్త పెంచి ఇచ్చేవిధంగా చూడాలని కలెక్టర్‌ను కోరారు. భూ నిర్వాసితులు ఎకరాకు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరగా నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకొని రూ.14 లక్షలు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇల్లు లేని పేద నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తనదని, రైతులు సహకరించాలని కోరారు. ఇందుకు సమ్మతించిన రైతులు రూ.14 లక్షలకు కాస్త పెంచి ఇవ్వాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పీఎన్ చేసిన నాటికి ప్రభుత్వ భూ విలువ ఎంత ఉంటుందో దానికి మూడు రెట్లు లెక్కించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, కానీ రైతులు, శాసనసభ్యుల కోరిక మేరకు నేడు చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్‌నాయుడు మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు నష్టం జరగడం సహజమేనని.. కానీ చాలామంది రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు మిగిలిన భూమికి ఎక్కువ డిమాండు వస్తుందని తెలిపారు. జనరల్ అవార్డుకు వెళ్తే రైతులు నష్టపోతారని.. అందుకే చర్చలు జరిపి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. బండరాయిపాకుల నిర్వాసితుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ తిరుపతయ్య, ఏడీ సర్వే శ్రీనివాసులు, తహసీల్దార్లు, పెద్దమందడి, ఖిల్లాఘనపురం మార్కెట్ కమిటీ చైర్మన్ నవనీత, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.


