రైసుమిల్లుల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

రైసుమిల్లుల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీ

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

వనపర్తి రూరల్‌: రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం, అధికారుల బృందం గురువారం పెబ్బేరు మండలం చెలిమిళ్ల సమీపంలో ఉన్న శ్రీ సత్యసాయి రైసుమిల్‌, జాతీయ రహదారి పక్కనున్న రైస్‌మిల్‌, గోదాంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. 2022–23 యాసంగి సీజన్‌లో ఆయా మిల్లులకు కేటాయించిన వరి ధాన్యం, మిల్లు, గోదాముల్లో బస్తాలను లెక్కించారు. కేటాయించిన ధాన్యంలో 6,491.92 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తేడా వచ్చిందని, విలువ రూ.18.51 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు.

కేఎల్‌ఐ కాల్వకు జలకళ

గోపాల్‌పేట: కేఎల్‌ఐ డి–8 కాల్వకు బుధవారం అధికారులు నీటిని వదిలారు. గురువారం ఉదయం గోపాల్‌పేట – ఏదుట్ల వెళ్లే దారిలో ఉన్న మేజర్‌–2 కాల్వ నిండుగా పారుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఎంతోకొంత వరిసాగు చేసుకున్న రైతులకు కాల్వ నీరు వచ్చేసరికి సంతోషంలో మునిగిపోయారు. మేజర్‌–2 కాల్వకు గండిపడకుండా తూము ఏర్పాటు చేసి సరిపడా నీరు వదలాలని రైతులు కోరుతున్నారు. కేఎల్‌ఐ డీ–8 కాల్వ ద్వారా ఉమ్మడి గోపాల్‌పేట మండలంతో పా టు పాన్‌గల్‌, వనపర్తి, కోడేరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుతుంది.

ఉచిత శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తి రూరల్‌: బీసీ విద్యార్థులకు నీట్‌ యూజీ, జేఈఈ–2027 ఉచిత లాంగ్‌టర్మ్‌ రెసిడెన్షియల్‌ శిక్షణ అందిస్తునట్లు ఎంజేపీ సొసైటీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆర్‌సీఓ శ్రీనివాస్‌గౌడ్‌, డీసీఓ శ్రీవేణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులతో పాటు నీట్‌, జేఈఈ–2026లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి https;//mjptbc admissions.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు నీట్‌లో 100, జేఈఈలో 40.. బాలురకు నీట్‌లో 50, జేఈఈలో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. బాలికలకు నాగోల్‌ సీఓఈ కళాశాలలో, బాలురకు అబ్దులాపూర్‌మెట్‌ సీఓఈ కళాశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. మెరిట్‌, సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని, దరఖాస్తులు అధికంగా వస్తే స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని తెలిపారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

కొత్తకోట రూరల్‌: మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మహిళా సమైఖ్య సర్వసభ్య సమావేశం, ఇందిరా మహిళాశక్తి 23వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సభ్యులతో మాట్లాడి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగా కాకుండా ఆర్థిక, వ్యాపార శక్తులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్‌ పార్కులు, కామన్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్న ఎమ్మెల్యే, కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వీఓఏల వేతనాల పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement